జనం గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించడంతో టర్కీలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొత్తం 10 ప్రావిన్సుల్లో భూకంపం విలయం సృష్టించింది. భూకంప తీవ్రతకు తుర్కియేలో దాదాపు 3వేల భవనాలు ధ్వంసమయ్యాయి. గజియాన్‌టెప్‌లో ఏడాది వయసున్న చిన్నారిని శిథిలాల నుంచి వెలికితీశారు. మృత్యువును జయించిన ఆ చిన్నారికి కనీసం చిన్న గాయం కూడా కాకపోవడం విశేషం.
ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా లు చిగురుటాకులా వణికిపోయాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. పులిమీద పుట్రలా గంటల వ్యవధిలోనే మరో శక్తివంతమైన భూకంపం టర్కీపై విరుచుకుపడింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. సోమవారం సాయంత్రం ఈశాన్య టర్కీలో రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రతతో మరో భూకంపం నమోదయ్యింది. ఇకినోజు పట్టణానికి దక్షిణ-ఈశాన్యంగా 4 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించింది.
సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపానికి టర్కీలో పలు ప్రధాన నగరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇక, సిరియా జాతీయ భూకంప కేంద్రం అధిపతి రేద్ అహ్మద్ ప్రభుత్వ రేడియోతో మాట్లాడుతూ.. తమ దేశ చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపంగా అభివర్ణించారు. సిరియా అధీనంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 326 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
అటు, టర్కీలోనూ మృతుల సంఖ్య 1,000 దాటింది. ఇప్పటి వరకూ 912 మంది చనిపోయినట్టు టర్కీ అధ్యక్షుడు రెసెప్ టయ్యిపి ఎర్డోగాన్ తెలిపారు. మరో, 5,300 మందికిపైగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సజీవంగా బయటకు తీయడానికి రెస్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గడ్డుకట్టుపోయే చలి సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. వీధుల్లో మంచు పేరుకుపోవడంతో.. శిథిలాల తొలగించడం కష్టమవుతోంది. కుర్దిష్ నగరం దియార్‌బకీర్‌లో ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు వారి బంధువులు తెలిపారు. ‘‘మా సోదరి, ఆమె ముగ్గురు పిల్లలు, భర్త, అత్త మామలు శిథిలాల కింద’’ ఉన్నారు అని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదిలావుంటే టర్కీ భూకంప ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే, పలు దేశాలు సైతం సాయానికి ముందుకొస్తున్నాయి.