రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద ఓ వ్యక్తి కత్తులతో వీరంగం చేశాడు. రెండు చేతుల్తో రెండు కత్తులు పట్టుకొని అక్కడ ఉన్న వారిపై దాడికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసుల హెచ్చరికలు కూడా ఖాతరు చేయకుండా అతడు వీరంగం చేశాడు. దీంతో పోలీసులు గన్‌తో అతడి కాలిపై కాల్చారు. నిందితుడు కిందపడగానే, లాఠీలతో చితకబాది అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని కాల్బురిగిలో ఆదివారం (ఫిబ్రవరి 5) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనను చూసేందుకు స్థానికులు అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడారు.
నల్లని బనియన్, ప్యాంటు ధరించి.. మార్కెట్ మధ్యలో నిలబడి నిందితుడు కత్తులతో వీరంగం చేశాడు. పోలీసులు అతడిని చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. ‘మార్కెట్ వద్ద ఓ దుండగుడు కత్తితో ప్రజలపై దాడికి యత్నించాడు. పోలీసులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినప్పుడు.. అతడు మా పోలీసు సిబ్బందిపై కూడా దాడి చేశాడు. ఆత్మరక్షణ కోసం, ప్రజల భద్రత కోసం.. పోలీసులు ఆ దుండగుడిపై కాల్పులు జరిపారు’ అని కాల్బురిగి నగర పోలీసు కమిషనర్ చేతన్ తెలిపారు. నిందితుడిని ‘జాఫర్’గా గుర్తించారు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించనున్నారు.