రైల్లో కొందరు తమ ప్రవర్తనతో ఇతరులను ఇబ్బందిపెడుతుంటారు. నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోరు. తాజాగా అలాంటి వీడియో ఒకటి తెగవైరల్ అవవుుతోంది. రైళ్లలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. చిన్న ప్రమాదం జరిగినా వందలాది ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. ప్రయాణికుల సురక్షత, భద్రతకు పెద్ద పీట వేసే ఇండియన్ రైల్వే.. అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఉన్న పేలుడు పదార్థాలు, పెట్రోల్, డీజిల్ లాంటి వాటిని రైళ్లలో అనుమతించదు. పొగతాగడం నిషేధం. అయితే, అల్ప బుద్ధి గల కొంత మంది అధికారుల కళ్లుగప్పి రైళ్ల నిషేధిత చర్యలకు పాల్పడుతుంటారు. ఎవరూ చూడకుండా బాత్రూమ్‌కు వెళ్లి సిగరెట్, బీడీ అంటిస్తారు. తాజాగా ఇద్దరు యువకులు ఏకంగా కోచ్‌లోనే సిగరెట్ వెలిగించారు. చిన్న పిల్లలు, మహిళలు, పెద్ద వారు ఉన్నా.. నిస్సిగ్గుగా సిగరెట్ పొగ పీల్చారు. రైలులో అలా చేయడం ప్రమాదకరమని తోటి ప్రయాణికులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే, వారిని దుర్భాషలాడుతూ అనుచితంగా ప్రవర్తించారు. మనీష్ జైన్ అనే వ్యక్తి ట్వీట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.
‘ప్రయాణికులు, పిల్లలు, సీనియర్ సిటిజన్ల ముందు ఈ యువకులు సిగరెట్ కాల్చారు. అలా చేయొద్దని చెప్పిన వారిని బూతులు తిట్టారు. రైలు నం 14322, కోచ్ నంబర్ S-5లో సీట్ నంబర్ 39, 40లో ఈ ఘటన చోటుచేసుకుంది. దయచేసి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోండి’ అంటూ మనీష్ జైన్ ట్వీట్ చేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ట్విటర్ ఖాతాతో పాటు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక ఖాతాను ట్యాగ్ చేశారు.
రైల్వే చట్టంలోని సెక్షన్ 167 ప్రకారం.. కంపార్ట్‌మెంట్‌లో పొగతాగడం నిషేధం. రైల్వే అధికారులు గుర్తించినా, తోటి ప్రయాణికులు అభ్యంతరం తెలిపినా.. నిందితులపై 100 రూపాయల జరిమానా విధిస్తారు.
మనీష్ జైన్ ట్వీట్‌కు ‘రైల్వే సేవా’ బదులిచ్చింది. ప్రయాణానికి సంబంధించిన వివరాలు (PNR/ UTS నంబర్), మొబైల్ నంబర్‌ను షేర్ చేయమని కోరింది. లేకపోతే, నేరుగా http://railmadad.indianrailways.gov.inలో ఫిర్యాదు చేయవచ్చని, సత్వర పరిష్కారం కోసం 139కి డయల్ చేయవచ్చని తెలిపింది. కాసేపటి తర్వాత, బండికుయ్ స్టేషన్ సమీపంలో ఆర్‌పీఎఫ్ సిబ్బంది వచ్చి నిందితులను హెచ్చరించారని మనీష్ జైన్ తెలిపారు. రైలులో సిగరెట్ తాగొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చారని వెల్లడించారు.
‘చాలా మంది ప్రయాణీకుల ప్రాణాలకు, ప్రజా ఆస్తులకు హాని కలిగించేవిధంగా ప్రవర్తించిన వారిద్దరినీ అరెస్టు చేయాలి’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘పవర్ ఆఫ్ డిజిటల్ ఇండియా. థాంక్యూ ఇండియన్ రైల్వే’ అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టారు. రైళ్లలో పొగతాగడంపై ఎన్ని నిషేధాజ్ఞలు ఉన్నా.. కొంత మంది వాటిని ఖాతరు చేయకుండా ప్రవర్తిస్తుంటారు. రైళ్లలో తరచూ అగ్నిప్రమాదాలు ఓ వైపు కలవర పెడుతుండగానే.. బాత్రూమ్‌లలో సిగరెట్, బీడీ పీకలు కనిపిస్తుంటాయి. తేడా జరిగితే వందల మంది ప్రాణాలు బుగ్గి పాలవుతాయి. అలాంటి వారిని సొంత కుటుంబసభ్యులే ఉపేక్షించకూడదు. శిక్షలు మరింత కఠినం చేయాలని, జరిమానా మొత్తం పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.