రక్తం దొరకక మృత్యు ఒడిలోకి చేరుతున్న చాలామంది చిన్నారులు, పెద్దలకు తమవంతుగా రక్తాన్ని అందించేందుకు నిత్యం ప్రయత్నం చేస్తున్నట్లు ప్రాణదాత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డోకి శ్రవణ్ కుమార్ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం లో మాట్లాడుతూ, ప్రాణదాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ బుధవారం స్థానిక డే అండ్ నైట్ జంక్షన్ వద్ద ఉన్న న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ లో స్వచ్ఛంద రక్తదానం శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ప్రాణదాత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డోకి శ్రవణ్ కుమార్ , పొట్నూరు ప్రతాప్, గురుగుబెల్లి చంద్రశేఖర రావు లు మాట్లాడారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 8వ తేదీన రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా తల సేమియా చిన్నారులను కాపాడేందుకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని వారు వివరించారు. న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలువురు తలసేమియా పిల్లలను దత్తత తీసుకొని ఆదరిస్తున్నామని చెప్పారు. ఇటువంటి చిన్నారులను రక్షించుకునేందుకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి తమ సంస్థ తరఫున సభ్యులంతా స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. రక్తం ఇవ్వకుండా మరణించకు. ప్రాణదాతగా జీవించు అనే నినాదంతో ప్రాణదాత ఫౌండేషన్ ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తించి యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.