తన భద్రత తొలగింపుపై టీడీపీ శాసన సభ్యుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ హైకోర్టును ఆశ్రయించారు. పయ్యావుల పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శిని, డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.
ఫోన్ ట్యాపింగ్ పై తాను మాట్లాడినందు వల్లే భద్రత తొలగించారని పయ్యావుల తన పిటిషన్ లో ఆరోపించారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలకు భద్రత కుదించిన అంశాన్ని కూడా పయ్యావుల తన పిటిషన్ లో ప్రస్తావించారు. 1994 నుంచి తనకు 2 ప్లస్ 2 భద్రత కొనసాగుతోందని, కానీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసినప్పటి నుంచి భద్రత తొలగించారని, గత ఆరు నెలలుగా తాను భద్రత లేకుండానే తిరుగుతున్నానని వెల్లడించారు. త్వరలో ఎన్నికలు రానున్నాయని, తీవ్రవాద ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో, ప్రచారం కోసం తిరిగేందుకు భద్రత అవసరమని పయ్యావుల కోర్టుకు విజ్ఞప్తి చేశారు.