వందే భారత్ రైళ్లపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. దేశంలోని ప్రముఖ పట్టణాల మధ్య పరుగులు తీస్తోన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లకు రాళ్ల దెబ్బలు తప్పటంలేదు. ముందు నుంచే ఈ రాళ్ల దాడి బెడదను ఎదుర్కొంటున్న వందే భారత్ తాజాగా మరోసారి అదే ఘటన పునరావృతమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో రాళ్ల దాడులు జరగ్గా.. ఇప్పుడు తాజా చత్తీస్‌గడ్‌లో జరిగింది. నాగ్‌పూర్ నుంచి బిలాస్‌పూర్‌కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఛత్తీస్‌గఢ్‌లోని దధాపరాలో సోమవారం మధ్యాహ్నం రాళ్ల దాడి జరిగింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని దధాపరా నుంచి వెళుతుండగా పలువురు దుండగులు రైలుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఐదు కోచ్‌లలోని తొమ్మిది కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే.. రైల్‌లో ప్రయాణిస్తోన్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఈ దాడికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందించగా.. వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) దర్యాప్తు ప్రారంభించింది. రైలులో అమర్చిన సీసీ కెమెరాలను ఉపయోగించి దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అయితే.. ఇటీవలే తెలంగాణలో ఖమ్మంలో కూడా వందే భారత్ ఎక్స్ ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టిన రైలుపైకి.. ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరికొట్టారు. ఈ దాడిలో సీ-12 కోచ్ (చైర్ కార్ కోచ్) విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసం అయింది. శుక్రవారం (ఫిబ్రవరి 3) సాయంత్రం ఈ ఘటన జరిగింది.
ఇదిలా ఉంటే.. వందే భారత్ రైలు ప్రారంభానికి ముందే రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. విశాఖపట్నం సమీపంలోని కంచరపాలెంలో రామ్మూర్తి పంతులు పేట గేటు వద్ద ఆకతాయిలు ఈ రైలుపై రాళ్లు విసిరారు. ఆ దాడిలో రెండు కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి. రైలు కోచ్‌కు అమర్చిన సీసీటీవీ కెమెరా దృశ్యాలు ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకున్నారు. వందే భారత్ రైళ్లపై పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ రెండు సార్లు రాళ్ల దాడి జరిగింది.