బందరు కమల్ హాసన్ కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని సెటైర్లు వేశారు. కృష్ఱా జిల్లా మచిలీపట్నంలో ప్రభుత్వ భూమిని వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి కేటాయించడంపై రగడ నడుస్తోంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ నేతలతో కలిసి నిరసనకు దిగారు.. ఆ స్థల పరిశీలనకు వెళుతుండగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో మచిలీపట్నంలో హైడ్రామా కనిపించింది. అయితే కొల్లు రవీంద్ర చేసిన విమర్శలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
కొల్లు రవీంద్ర చెప్పేవన్నీ శ్రీరంగనీతులే అన్నారు.. సోమవారం బందరులో రవీంద్ర నటన ముందు కమల్ హాసన్, ఎస్వీ రంగారావు కూడా సరిపోరని ఎద్దేవా చేశారు. ఉద్ధేశపూర్వకంగా పోలీసుల పై కొల్లు దాడి చేశారని.. సానుభూతి రాజకీయాల కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. డ్రామాలు చేసి.. దాడులు చేసి.. కేసులు పెట్టించుకుని.. బెయిల్ వస్తే ఊరేగింపులు చేసుకుంటారని సెటైర్లు పేల్చారు. పదవి ఉన్నప్పుడు పనిచేయరు.. పదవి పోగానే ఇలాంటి దిక్కుమాలిన డ్రామాలాడతారన్నారు.
ప్రభుత్వ ఆస్తులపై ముందు కన్నేసింది ఎవరని ప్రశ్నించారు నాని. హైదరాబాద్ నడిబొడ్డున టీడీపీ పార్టీ ఆఫీస్ ఉన్న స్థలం ప్రభుత్వ భూమి కాదా.. మంగళగిరిలో టీడీపీ పార్టీ ఆఫీస్ ఉన్న స్థలం ఎవరిది ప్రభుత్వానిది కాదా అన్నారు. కొల్లు రవీంద్ర ఎందుకీ జన్మ.. అసత్యాలు.. మోసాలు.. డ్రామాలు ఆడే జన్మ అవసరమా అన్నారు. కొల్లు రవీంద్ర బందరు కమల్ హాసన్ అంటూ ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలో టీడీపీ కార్యాలయానికి 50 సెంట్ల ప్రభుత్వభూమి లీజుకి ఇవ్వమని అడిగింది రవీంద్ర కాదా అన్నారు.
టీడీపీ కార్యాలయానికి స్థలం అడిగి.. ఇప్పుడు పత్తిత్తు కబుర్లు చెబుతున్నావా అంటూ మండిపడ్డారు. పోలీసులపై దాడులు చేసి.. కేసులు పెట్టించుకుంటారన్నారు. మళ్లీ ఆయన రక్షణకు మాత్రం పోలీసులు కావాలా అన్నారు. బందరులో పోలీసులను కొట్టడానికి కారణమేంటన్నారు. పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలం ఇవ్వొచ్చని జీవో తెచ్చింది టీడీపీ ప్రభుత్వం కాదా.. ఇప్పుడెందుకు డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సిగ్గుందా.. కొల్లు రవీంద్ర లాంటి వ్యక్తుల కారణంగా రాజకీయ నాయకుల విలువలు దిగజారిపోతున్నాయన్నారు.