విశాఖపట్టణం జిల్లా, గూడెంకొత్తవీధి మండలం ఆకులూరు గ్రామంలో జీలుగు కల్లు తాగి ఇద్దరు గిరిజనులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.వివరాల్లోకి వెళ్ళితే..... గాలికొండ పంచాయతీ ఆకులూరు గ్రామంలో నివాసముంటున్న పాంగి రామదాసు(53), అతని కుమారుడు పాంగి లోవరాజు(25) ఒకే ఇంట్లో కుటుంబాలతో నివాసముంటున్నారు. రామదాసు ఇంటికి ఒడిశా నుంచి బంధువులైన కొర్ర బందు, దాలిమ దంపతులు ఆదివారం సాయంత్రం వచ్చారు. సోమవారం ఉదయం తెల్లవారుజామున ఇంటికొచ్చిన అతిథులకు మర్యాదపూర్వకంగా కల్లు ఆతిథ్యంగా ఇవ్వాలని రామదాసు భావించాడు. కుమారుడు లోవరాజును కల్లు సేకరించే జీలుగు చెట్ల వద్దకు పంపించాడు. ప్లాస్టిక్ క్యాన్‌లో తీసుకొచ్చిన కల్లును పొయ్యిపై కాస్త వేడి చేసుకుని రామదాస్, కుమారుడు లోవరాజు, కొర్ర బందు, దాలిమాలు తాగారు. కొంత సేపటికి ఆ నలుగురికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. అయితే రామదాసు, లోవరాజుకు ఎక్కువగా వాంతులు, విరేచనాలు కావడంతో మధ్యాహ్నం సప్పర్ల ఆస్పత్రికి బంధువులు తీసుకొచ్చారు. ఆ ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వెంటనే చింతపల్లి ఏరియా ఆస్పత్రికి పంపించారు. సాయంత్రం ఐదు గంటలకు వారికి వైద్యులు చికిత్స ప్రారంభించారు. మంగళవారం తెల్లవారుజామున లోవరాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రామదాసును మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఐదేళ్లలోపు కూతురు, కుమారుడు ఉన్నారు. కాగా రామదాసు, లోవరాజులతో కలిసి కల్లు సేవించిన ఒడిశాకు చెందిన బందు, దాలిమాలు ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.