ఇటీవలే పాక్ ప్రధాని పదవిని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ అక్కడి ప్రజల మద్దతును కూడగట్టేందుకు మళ్లీ కశ్మీర్ విషయాన్ని లేవనెత్తారు. భారత్ తో సంబంధాలు బలపడాలంటే 2019లో మోదీ ప్రభుత్వం తొలగించిన ఆర్టికల్ 370ని మళ్లీ పునరుద్ధరించాల్సిందేనని చెప్పారు. ఇదే సమయంలో భారత్ పై ఇమ్రాన్ పరోక్ష ప్రశంసలు కూడా కురిపించారు. రూల్ ఆఫ్ లా ను అమలు చేయడం ద్వారా భారత్ అభివృద్ధి చెందుతోందని... ఇదే రూల్ ఆఫ్ లా ను అమలు చేయకపోతే పాకిస్థాన్ భవిష్యత్తు అంధకారమవుతుందని అన్నారు.
దేశాన్ని పాలిస్తున్న పీఎంల్ (ఎన్)... పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్)కు ప్రజలు ముగింపు పలకాలని... రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పారు. ఖైబర్ ఫక్తూంఖ్వా ప్రావిన్స్ లో మరో 90 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనను కుట్ర పూరితంగా ప్రధాని పదవి నుంచి తొలగించారని మండిపడ్డారు.
తనను రాజకీయాల్లో లేకుండా చేసేందుకు దేశంలోని అత్యంత శక్తిమంతమైన వారంతా కలిసి కుట్ర చేశారని చెప్పారు. ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ కూడా ఈ కుట్రలో భాగమేనా? అనే ప్రశ్నకు బదులుగా... ఆయన పదవిని చేపట్టి రెండు నెలలు మాత్రమే అవుతోందని... అందువల్ల ఆయన విషయంలో తాను 'బెనిఫిట్ ఆఫ్ డౌట్' అని చెపుతానని అన్నారు.