తాగేసిన వాటర్ ఫ్లాస్టిక్ బాటిల్ ను నిల్వవుంచకూడదన్నది శాస్త్రవేతలు ఎప్పటినుంచో చెబుతున్నారు. వాటర్ బాటిల్ ఖాళీ అయిన తర్వాత పడేయాలి. కానీ, కొందరు దాన్ని పారేయకుండా ఇంట్లో మళ్లీ మళ్లీ ఉపయోగిస్తుంటారు. అలా చేయకూడదన్నది నిపుణుల సూచన. సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థాలు, 5ఎంఎం కంటే చిన్న పరిమాణంలో ఉన్నవి సులభంగా మన శరీరంలోకి చేరతాయి. అలా మన శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడాన్ని బయోఅక్యుములేషన్ గా చెబుతారు.
ఇలా చేరిన సూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్థాలు మనకు హాని చేస్తాయనే దానికి కచ్చితమైన ఆధారాల్లేవు. కానీ, దీర్ఘకాలంలో ఇవి మన శరీరానికి హాని చేయవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అందుకే ఒకసారి వాడిన తర్వాత వాటిని పారేయాలని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ తయారీకి ఉపయోగిస్తున్న రసాయనాలే ఇందుకు కారణం. ఈ రసాయనాలు కొన్ని వ్యాధులకు కారణమవుతాయని గతంలో పలు పరిశోధనల్లో తేటతెల్లమైంది. నిజానికి మానవ విసర్జితాల్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉండడాన్ని గుర్తించిన పరిశోధకులు.. రోజువారీ ప్లాస్టిక్ వ్యర్థాలకు ఎక్స్ పోజ్ అవుతున్న తీరుకు నిదర్శనంగా తెలియజేస్తున్నారు.
ఆహారపదార్థాల్లోనూ, వాటర్ బాటిళ్లలోనూ ఈ సూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్థాలను పలు సందర్భాల్లో గుర్తిస్తూనే ఉన్నారు. వాటర్ బాటిళ్ల మూతలు, బాటిల్ పై భాగం, బాటిల్ మెటిరీయల్ నుంచి 1ఎంఎం కంటే తక్కువ పరిమాణంలోని కాలుష్యాలు విడుదల అవుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. తయారీ కేంద్రాల్లో ఎంతో ఒత్తిడితో నీటిని నింపడం, బాటిల్ షేక్ కావడం వల్ల, ఆ సమయంలో వ్యర్థాలు విడుదల అవుతుంటాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.