తాజాగా గూగుల్ వర్సెస్ మైక్రోసాఫ్ట్ సంస్థ అన్నట్లుగా ఓ విషయంలో పోటీ సాగుతోంది. సెర్చ్ ఇంజిన్ మార్కెట్‌లో గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా కొత్త బింగ్ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ సారథ్యంలోని చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’కి పోటీగా గూగుల్ బార్డ్ పేరిట తన చాట్‌బాట్‌ను పరిచయం చేసిన మరుసటి రోజు మైక్రోసాఫ్ట్ కొత్త ‘బింగ్’ను వినియోగదారుల ముందుంచింది. చాట్‌జీపీటీ కంటే అధిక సామర్థ్యం కలిగిన లాంగ్వేజ్ మోడల్‌తో ఈ సెర్చ్ ఇంజిన్‌ను తీర్చిదిద్దింది. కొత్త బింగ్‌తో పాటూ ఎడ్జ్ బ్రౌసర్ కూడా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.
కృత్రిమ మేథ(ఏఐ) ఆధారిత లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌తో సిద్ధం చేసిన బింగ్ కొత్త వర్షెన్.. ఆన్‌లైన్‌లో సమాచార అన్వేషణకు మరింత అనుకూలమని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. సమాచార సేకరణ కోసమే దీన్ని ప్రత్యేకంగా రూపొందించామని చెప్పారు. చాట్‌జీపీటీ కంటే ఇది శక్తిమంతమైనదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బింగ్ సెర్చ్ ఇంజిన్, బ్రౌజర్ సేవలు కొద్ది మంది వినియోగదారులకు మాత్రమే పరిమితమయ్యాయి. భవిష్యత్తులో దీన్ని అందరికీ అందుబాటులోకి తెస్తామని మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్, కంస్యూమర్ మార్కెటింగ్ ఆఫీసర్ యూసుఫ్ మెహెదీ పేర్కొన్నారు. Bing.comలో కొత్త సెర్చ్ ఇంజిన్ సేవలను ట్రై చేయవచ్చు. పూర్తిస్థాయి సేవల కోసం వినియోగదార్లు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు.
ఏఐ ఆధారిత బింగ్ సెర్చ్ ఇంజిన్, ఎడ్జ్ బ్రౌజర్లు..వినియోగదారులకు సాయంగా ఉండే కోపైలట్‌లు అని మైక్రోసాఫ్ట్ సంస్థ అభివర్ణించింది. అవి యూజర్లు కోరిన సమాచారాన్ని మరింత కచ్చితంగా, పూర్తి వివరాలతో అందిస్తాయని పేర్కొంది. ‘‘సాఫ్ట్‌వేర్ రంగంలోని అన్ని విభాగాల ముఖచిత్రాన్నీ ఏఐ మార్చి వేస్తుంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో సమాచార అన్వేషణ తీరుతెన్నులు సమూలంగా మారిపోతాయి’’ అని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు.