విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంపై.. భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ఈసారి ఎలాగైన విశాఖ పార్లమెంట్‌ను కమలం ఖాతాలో వేసుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత జీవీఎల్ నరసింహా రావును అధిష్టానం రంగంలోకి దింపినట్టు సమాచారం. అందుకే.. ఇటీవల కాలంలో ఆయన విశాఖలో మకాం వేశారు. బీజేపీ గెలుపునకు ఉన్న అవకాశాలను ఆరా తీస్తున్నారు. విశాఖపట్నంలో బీజేపీకి మంచి పట్టు ఉందని భావించిన అధిష్టానం.. సొంతంగా గెలిచేలా పని చేయాలని జీవీఎల్‌కు సూచించినట్టు తెలుస్తోంది.
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి.. ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. మొదటిసారి స్వతంత్ర అభ్యర్థిగా లంక సుందరం విజయం సాధించారు. ఆ తర్వాత సోషలిస్ట్ పార్టీ.. అనంతరం కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ.. 1967లో జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెస్సివ్ గ్రూప్ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మూడుసార్లు హస్తం పార్టీ జయకేతనం ఎగరేసింది. కానీ.. కాంగ్రెస్ జోరుకు 1984లో సైకిల్ బ్రేక్ వేసింది. భాట్టం శ్రీరామమూర్తి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
మళ్లీ ఆ తర్వాత కాంగ్రెస్.. అనంతరం టీడీపీ.. ఆ తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాయి. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేసింది. కానీ.. 2014 ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ గెలిచారు. అయితే.. గతంలో విశాఖలో బీజేపీ మంచి పట్టు ఉండేదని.. అది 2019లో మిస్ అయ్యిందని కాషాయ పార్టీ అధిష్టానం భావించిందట. అందుకే 2024లో ఎలాగైన విశాఖలో విజయం సాధించాలని పట్టుదలగా ఉందట.
అందుకే.. జీవీఎల్ నరసింహా రావును బీజేపీ పెద్దలు రంగంలోకి దింపారని తెలుస్తోంది. ఆయన గతంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకపోయినా.. 2024లో పార్టీ ఆదేశిస్తే.. తానే ఎంపీగా పోటీ చేస్తానని జీవీఎల్ స్పష్టం చేస్తున్నారు. అదీ కాకుండా.. జీవీఎల్ కాపు సామాజికవర్గానికి చెందిన నేత. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉంటారు. దీంతో.. కాపు అంశం కలిసి వస్తుందని ఇటు జీవీఎల్, అటు బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. చూడాలి మరి.. బీజేపీ వ్యూహం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.