భూకంప అవకాశాలు అన్ని చోట్ల రావు. దీనికి కారణాలు లేకపోలేదు. ఇదిలావుంటే ఇటీవల సంభవించిన భారీ భూకంపం కారణంగా టర్కీ, సిరియాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది ఇళ్లు నేలకూలాయి. తెల్లవారుజామున సంభవించిన భూకంపం తర్వాత మధ్యాహ్నం సమయంలో మళ్లీ ప్రకంపనలు సంభవించడంతో.. భవనాలు కూలిపోయి.. ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. భారత్ సహా ప్రపంచ దేశాలు వెంటనే స్పందించి మానవతా సాయాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
టర్కీ భూకంపం నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాలు ఎంత వరకు సేఫ్ అనే చర్చ కూడా మొదలైంది. అయితే తెలుగు రాష్ట్రాలు భూకంపాలు తక్కువగా సంభవించే సెస్మిక్ జోన్ 2, 3ల్లో ఉన్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం నగరాలు జోన్-2లో ఉన్నాయి. ఇక్కడ భూకంపం వచ్చే అవకాశాలు తక్కువ. తెలంగాణలోని మూడొంతుల భూభాగం కూడా ఈ జోన్‌లోనే ఉంది. రాయలసీమలో చిత్తూరు, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే మిగతా ప్రాంతం మొత్తం జోన్-2లో ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా జోన్-2లోనే ఉన్నాయి.
భద్రాచలం, ఖమ్మం, వరంగల్, రాజమండ్రి, కాకినాడ విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాలతోపాటు.. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు జిల్లాలు జోన్-3లో ఉన్నాయి. ఇక్కడ భూకంపాలు వచ్చే ముప్పు, భూకంప తీవ్రత జోన్-2తో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంటుంది. భద్రాచలం ప్రాంతం (గోదావరి లోయ), ఒంగోలు ప్రాంతం (గుండ్లకమ్మ ప్రాంతం)లో రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, గుండాల, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు మండలాలు.. విజయనగరం (పాత) జిల్లాలోని గరివిడి, నెల్లిమర్ల మండలాలు సెస్మికల్లీ యాక్టివ్ జోన్‌లో (భూమి కంపించే అవకాశం ఎక్కువగా ఉండే ప్రాంతాలు) ఉన్నాయి.
హైదరాబాద్‌లోని జూబీహిల్స్, బంజారాహిల్స్, మేడ్చల్, శామీర్‌పేట, శంకరపల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మొయినాబాద్ ప్రాంతాలు కూడా సెస్మీకల్లీ యాక్టివ్ జోన్‌లో ఉన్నాయి.
తూర్పు కనుమలు, గోదావరి లోయ ప్రాంతాల్లో భూఫలకాల కదలికలు ఎక్కువ. 1969లో భద్రాచలం సమీపంలో రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించడంతో.. కిన్నెరసాని రిజర్వాయర్‌పై ప్రభావం పడింది. విజయనగరం ఏరియాలో 1917లో 5.5 తీవ్రతో భూకంపం సంభవించింది. ఒంగోలులోని 30 మండలాల్లో భూప్రకంపనలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇండియా విషయానికి వస్తే.. మన దేశంలో ఐదు భూకంప జోన్లు ఉన్నాయి. గువహటి, శ్రీనగర్ జోన్-5లో ఉన్నాయి. ఢిల్లీలోనూ భూకంపం వచ్చే ముప్పు ఎక్కువే. ముంబై, చెన్నై నగరాలు జోన్-3లో ఉన్నాయి. ఉత్తర భారతదేశం, జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్, ఉత్తర బిహార్లోని కొద్ది భాగం, అండమాన్ నికోబార్ దీవులు జోన్-5లో ఉన్నాయి. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, సిక్కిం, ఉత్తర ప్రదేశ్ ఉత్తర భాగం, బిహార్, బెంగాల్, గుజరాత్‌లోని కొన్ని భాగాలు, మధ్యప్రదేశ్‌లోని కొంత భాగం, రాజస్థాన్ జోన్-4లో ఉన్నాయి. దక్షిణ భారతదేశం, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, ఒడిశా మిగతా రాష్ట్రాలు జోన్-3, జోన్-2లలో ఉన్నాయి.