మార్కాపురం ప్రాంతంలో దొంగనోట్ల చలామణి కలకలం రేపుతోంది. ఇటీవల ఎర్రగొండపాలం మండలంలో వృద్ధాప్య పింఛన్‌ల పంపిణీలో వలంటీర్ బ్యాంక్ నుంచి తెచ్చిన అసలు నగదుకు బదులు దొంగనోట్లను పంపిణీ చేస్తూ పట్టుబడ్డాడు. తాజాగా పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్ (కుంట) వద్ద ఇద్దరు వ్యక్తులు తమకు కావాల్సిన వస్తువుల కొనుగోలు నెపంతో వారి వద్ద ఉన్న రూ.500 నోట్లను మార్చారు. అనుమానం వచ్చిన దుకాణదారుడు వాటిని దొంగనోట్లుగా గుర్తించాడు. దీంతో ఆ ఇద్దరూ విజయవాడ వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా స్థానికులు వారిని కిందకు దించి పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 64 రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి నుంచి వారిని దేవరాజుగట్టులోని పెద్దారవీడు పోలీస్‌స్టేషన్‌లో ఉంచి తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. ఆ విచారణలో ఇద్దరు వ్యక్తులదీ గిద్దలూరు ప్రాంతంగా నిర్ధారించారు. వీరికి దొంగనోట్లు సరఫరా చేస్తున్న వ్యక్తి సమాచారంపై పోలీసులు దృష్టి సారించారు. దొంగనోట్లు మార్పిడి చేస్తున్న వ్యక్తులు దొంగనోట్లు సరఫరా చేసే వ్యక్తికి రూ.500 ఇస్తే అతను వీరికి రూ.1500 దొంగనోట్లు ఇస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.