టీడీపీ యువనేత లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఆదివారం తిరుపతి జిల్లాలోకి ప్రవేశించనుంది.12వ తేది సాయంత్రం చిత్తూరు జిల్లా కార్వేటినగరం నుంచీ పుత్తూరు మండలంలో అడుగుపెట్టనున్న లోకేశ్ శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ కళాశాల వద్ద ప్రజలతో మాట్లాడనున్నారు. అనంతరం సమీపంలోని చెర్లోపల్లిలో రాత్రి బస చేయనున్నారు.13వ తేదీ ఉదయం నుంచీ జిల్లాలో పాదయాత్ర మొదలు కానుంది. ఈ నేపధ్యంలో పాదయాత్రను విజయవంతం చేయడానికి జిల్లా టీడీపీ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. దీనికోసం నేడు తిరుపతి జిల్లా టీడీపీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు.పాదయాత్రలో సాధారణ కార్యకర్తలతో పాటు అనుబంధ విభాగాలన్నింటినీ భాగస్వామ్యం చేసేందుకు జిల్లా పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.కాగా జిల్లాలో పాదయాత్ర నగరి నియోజకవర్గం నుంచీ మొదలై చంద్రగిరితో ముగియనుంది. నగరి నియోజకవర్గానికి సంబంధించి పుత్తూరు మండలంలో ఒకరోజు మాత్రమే పాదయాత్ర సాగుతుంది.14, 15, 16 తేదీల్లో సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని నారాయణవనం, పిచ్చాటూరు, కేవీబీపురం మండలాల్లో సాగుతుంది. 17వ తేదీ శ్రీకాళహస్తి చేరుకుంటుంది.18న పాదయాత్ర వుండదని సమాచారం.శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లోకేశ్ కుటుంబసభ్యులతో కలసి ముక్కంటిని దర్శించుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. 19న శ్రీకాళహస్తి నుంచీ పాదయాత్ర మొదలై ఏర్పేడు, పాపానాయుడుపేట,గాజులమండ్యం,రేణిగుంట మీదు గా 21వ తేదీకి తిరుపతి చేరుకునేలా షెడ్యూలు ఖరారైంది. ఆపై చంద్రగిరి నియోజకవర్గం మీదుగా తిరిగి చిత్తూరు జిల్లాలోకి యాత్ర ప్రవేశించనుంది.