ఆర్థిక నేరగాడు అదానీకి ప్రధాని మోదీ, సీఎం జగన దాసోహమయ్యారని అనంతపురం సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు విమర్శించారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు శుక్రవారం సాయినగర్‌లోని ఎస్‌బీఐ ఎదుట నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి, జిల్లా కార్యవర్గసభ్యుడు శ్రీరాములు మాట్లాడుతూ ప్రధాని మోదీ హయాంలో గుజరాతకు చెందిన అదానీ 148బిలియన కోట్ల డాలర్లకు అధిపతి అయ్యాడని విమర్శించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో సీఎం జగన ప్రజల ఆస్తులను కట్టబెడుతున్నారని మండి పడ్డారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా రైల్వే, ఓడరేవులు, విమానయాన సంస్థలు, ఎల్‌ఐసీ, బీఎ్‌సఎనఎల్, బ్యాంకులను బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని విమర్శించారు. విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ, అదానీలు ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.కోట్లాది రూపాయల రుణాలు ఎగ్గొట్టినా అడిగే నాథుడే లేడన్నారు. రాష్ట్రంలో సీఎం జగన అదానీకి జిల్లాలో సోలార్ పరిశ్రమల కోసం 10వేల ఎకరాల భూములు కేటాయించడం సిగ్గుచేటన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న మోదీ, జగనలను ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అదానీ ఆస్తులను జప్తు చేయని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.