అనంతపురం జిల్లా, గోరంట్ల, మండలంలోని బెస్ట్ ఇన్నోవేషన యూనివర్సిటీ విద్యార్థి మనోహర్ సప్లిమెంటరీ పరీక్ష రాయనీయలేదన్న మనస్తాపంతో శుక్రవారం ఆత్మహత్యకు యత్నించాడు. తోటి విద్యార్థులు తెలిపిన సమాచారం మేరకు.. కొత్తచెరువు మండలం నర్సింగరాయనపల్లికి చెందిన మనోహర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. యూనివర్సిటీ ఫీజు సకాలంలో చెల్లించనివారికి సబ్జెక్టుకు రూ.5వేలు వంతున ఫైన విధించి వసూలు చేస్తున్నట్లు తెలిసింది. మనోహర్ ఫీజు ఆలస్యంగా చెల్లించినప్పటికీ శుక్రవారం సప్లిమెంటరీ పరీక్ష రాయనీయకుండా యాజమాన్యం అడ్డుకుంది. దీంతో మనస్తాపం చెందిన మనోహర్ కళాశాల వేళలు ముగిసిన తరువాత విషద్రావకం తాగి, ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే తోటి విద్యార్థులు గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం 108 వాహనంలో హిందూపురం ఆస్పత్రికి తరలించారు.