టిడ్కో గృహాల జాబితాలను మారిస్తే సహించబోమని రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం అన్నారు. ఆయన సీపీఐ నాయకులతో కలసి పల్నాడు జిల్లా, చిలకలూరిపేట పట్టణంలోని చెరువురోడ్డులో నిర్మించిన టిడ్కో గృహాల సముదాయాన్ని సందర్శించారు. అక్కడ నివాసం ఉంటున్న కొద్దిమంది లబ్ధిదారులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టిడ్కో గృహాల లబ్ధిదారులను వైసీపీ ప్రభుత్వం దారుణంగా వంచించిందన్నారు. నాలుగేళ్లు గడిచినా టిడ్కో గృహాలను అరకొరగా మాత్రమే లబ్ధిదారులకు అందజేశారన్నారు. జగనన్న ఇళ్ల పేరుతో కేవలం సెంటు భూమి కేటాయించి రూ.1.80 లక్షలతో ఇంటిని నిర్మించుకోవాలని చెప్పడం దారుణం అన్నారు. సీఎం జగన్‌కు తాడేపల్లి, హైదరాబాద్, బెంగుళూరులో అనేక ఎకరాల్లో ఇళ్లు ఉంటే పేదవాడికి మాత్రం కేవలం సెంటు భూమి కేటాయించటం అన్యాయం అన్నారు. నిర్మాణ వ్యయం పెరిగిన కారణంగా గృహ నిర్మాణాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇవ్వాలని, ఇసుక, సిమెంట్ ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని పేర్కొన్నారు. ఈనెల 22న లబ్ధిదారులకు బాసటగా విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఏ మారుతీ వరప్రసాదు, చిలకలూరిపేట ఏరియా కార్యదర్శి నాగబైరు రామ సుబ్బాయమ్మ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.