గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలంలోని చినకోండ్రుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన గొడవలపై ఆర్జేడీ సుబ్బారావు, డీఈవో శైలజలు శనివారం విచారణ నిర్వహించారు. పాఠశాలలో గొడవకు గల కారణాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను కూర్చోబెట్టి వారికి క్లాస్ తీసుకున్నారు. ఇక నుంచి ఎటువంటి గొడవలు పడినా టీసీలు ఇచ్చి పంపుతామన్నారు. విద్యార్థుల చేత రాతపూర్వకంగా లెటర్స్ తీసుకున్నారు. అలాగే ఉపాధ్యాయులకు సైతం క్లాస్ తీసుకున్నారు. దీనికి మీరూ బాధ్యులు అన్నారు. అందరికీ మెమోలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించిన ఆర్జేడీ, డీఈవోలు హెచ్‌ఎంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిన్న చిన్న పనులు కూడా మేము వచ్చి చూసి మీకు చెప్పాలా.. మీరెందుకు ఇక్కడి ఉంది అన్నారు. చినకోండ్రుపాడు గ్రామానికి వస్తున్న అధికారులకు దారిలోని నడింపాలెం హెచ్ డబ్ల్యూ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల విద్యాప్రమాణాలను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. ఈ కారణాలతో పాఠశాల హెచ్‌ఎం రాంబాబుతో పాటు మిగిలిన ఉపాధ్యాయులకు మెమోలు ఇవ్వడంతో పాటు ఎంఈవోకు షోకాజ్ నోటీసు ఇవ్వనున్నట్లు డీఈవో తెలిపారు.