రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని వారు ఐదు శాతం కటాఫ్ మార్కులు కలపాలని డిమాండ్ చేస్తూ శనివారం సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీనికి అనుమతులు లేని కారణంగా పెద్ద ఎత్తున ముట్టడికి వెళ్తున్నారన్న అనుమానంతో ఏలూరు జిల్లావ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎన్‌హెచ్ 5, టోల్‌ప్లాజాల వద్ద తెల్లవారుజాము నుంచి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ మాట్లాడుతూ సీఎం ఇంటి ముట్టడికి అనుమతులు లేవు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులు భవిష్యత్తును పాడుచేసుకోవద్దు. కేసుల్లో ఉంటే ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగావకాశాలు ఉండవు. విదేశీ ప్రయాణానికి పాస్‌పోర్టు మంజూరుకు కేసులు అవరోధాలుగా ఉంటాయి. పరీక్షల్లో కష్టపడి చదివి విజయం సాధించాలే తప్ప దురుద్దేశాలతో ప్రేరేపించే విషయాలపై ఆకర్షితులు కావద్దు’ అని సూచించారు.