రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నంబరు 1 రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి వ్యతిరేకమని, దీన్ని రాజ్యాంగ ఉల్లంఘనగానే భావించాలని సుప్రీంకోర్డు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల గౌడ్ తేల్చిచెప్పారు. ఫోరం ఫర్ డెమోక్రసీ అండ్ డెవల్‌పమెంట్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో ‘చట్టబద్ధ పాలన-భారత ప్రజాస్వామ్యం’ అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. జస్టిస్ గోపాలగౌడ్ మాట్లాడుతూ ‘అధికారంలో ఉన్నవారు హౌస్‌లో చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మెజారిటీ వచ్చినంత మాత్రాన ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే అవకాశాలు లేకుండా చేయడం సరికాదు. చాలా చట్టాలు చేసేప్పుడు ప్రతిపక్షాలకు చర్చించే అవకాశం ఇవ్వడం లేదు. క్యాపిటల్ సిటీతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ప్రభుత్వం పాల్పడే ఉల్లంఘనలకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. పోలీసు విభాగంలో కొందరు ప్రైవేట్ ఆర్మీగా మారిపోయి పనిచేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతల్ని కదలొద్దని, కారులోనే కూర్చోవాలని ఆదేశిస్తున్నారు’ అన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను విశాఖలో పోలీసులు ఎలా అడ్డుకున్నదీ, కారులోంచి బయటికి రావద్దని చెప్పిన విషయాన్ని జస్టిస్ గోపాలగౌడ్ ప్రస్తావించారు. స్థానిక సంస్థలకు కేంద్రం కేటాయించే నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడమేమిటని ప్రశ్నించారు. అదానీ కంపెనీ తమపై వచ్చిన 88 ప్రశ్నలకు నేటికీ సమాధానం ఇవ్వలేదన్నారు. లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ దేశంలో ఎన్నికల్లో ఎన్ని అవకతవకలు ఉన్నా శాంతియుతంగా అధికార మార్పిడి జరుగుతోందన్నారు.