ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో వరుసగా అరెస్టులు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో దూకుడు పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ వైసీపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ్‌రెడ్డి మాగుంటను శనివారం అరెస్టు చేసింది. అనంతరం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచింది. రాఘవ్‌ను దర్యాప్తు సంస్థ 10 రోజుల కస్టడీకి కోరగా అందుకు జడ్జి అనుమతించారు. రాఘవ్‌రెడ్డిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే సమయంలో ఆయన తండ్రి శ్రీనివాసులురెడ్డి కోర్టుకు వచ్చారు. కాగా, ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐ ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశాయి. వారిలో రాఘవ్ సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయినపల్లి, అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్ పి.శరత్‌చంద్రారెడ్డి, ఆడిటర్ బుచ్చిబాబు ఉన్నారు. మరోవైపు ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో భాగంగా జరిగిన సమావేశాల్లో రాఘవ్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.