అధికార వైసీపీని, ప్రధాన ప్రతిపక్షం టిడిపిని బిజెపి నేత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు టార్గెట్ చేశారు. కాపు సామాజికవర్గాన్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, విపక్ష తెలుగు దేశం పార్టీలు మోసం చేశాయని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆదివారం విశాఖపట్నంలో ఎంపీ జీవీఎల్ నరసింహరావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ దేశంలో కాపులకు జరిగిన అన్యాయం మరి ఏ వర్గానికి జరగేలేదని వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్లపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ల అంశంపై గత టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.
ఇక, పారిశ్రామిక కారిడార్లకు అవసరమైన భూసేకరణలో ఏపీ సర్కార్ మీన మేషాలు లెక్కిస్తోందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. విశాఖ పారిశ్రామిక కారిడార్ కోసం అవసరమైన భూసేకరణ ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించారు. ఎక్కడ భూ దోపీడీ, కుంభకోణాలు చేసేందుకు అవకాశం ఉందో.. అక్కడే జగన్ సర్కార్ పనులు చేస్తోందని జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు.
ఈ ఏడాది మార్చిలో విశాఖపట్నంలో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఏం చెబుతారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కనీసం పారిశ్రామిక కారిడార్లను ప్రారంభించ లేకపోయిందని చెబుతుందా అని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు పరిశ్రమలను వెళ్లగొట్టడంలో తాము సిద్ధహస్తులమని పెట్టుబడిదారుల సమావేశంలో చెబుతారా అని జగన్ సర్కార్‌పై ఎంపీ జీవీఎల్ నరసింహరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.