కృష్ణా జిల్లా, నందిగామ పట్టణంలో ఉరేసుకుని వీఆర్‌ఏ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన మేడా రమ(35) రుద్రవరం గ్రామ రెవెన్యూ సహాయకురాలిగా పనిచేస్తున్నది. 15 ఏళ్ల క్రితం తోటరావులపాడుకు చెందిన కొమ్మినేని మౌలేశ్వరరావుతో వివాహం జరిగింది. వీరు నందిగామ ఉమాకాలనీలో నివాసముంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమ మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కుమారుడు దినేష్ కార్తిక్ కేంద్రీయ విద్యాలయంలో ఏడో తరగతి, కుమార్తె వేద సాత్విక నవోదయ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నెకంటి జీవరత్నం, నాదెండ్ల నాని, గ్రామ నాయకులు ములకలపల్లి జానకిరామయ్య, కోట సంగయ్య, మాణిక్యరావు, ములకలపల్లి కృష్ణమోహన్ తదితరులు మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పట్టణ పోలీసులు తెలిపారు.