నెల్లూరు జిల్లా, పెంచలకోన క్షేత్రంలో టూరిజం పోలీస్ స్టేషన్ను సోమవారం ప్రారంభించనున్నారు. ఇక్కడి ఆలయ గదుల్లో చాలాకాలంగా పోలీస్ అవుట్ పోస్టు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం తాజాగా టూరిజం ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి పోలీస్ స్టేషన్లను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం సాయంత్రం జిల్లా అడిషనల్ ఎస్పీ(క్రైం) ప్రసాద్ కోనకు చేరుకుని స్టేషన్ ఏర్పాట్లు పరిశీలించారు. అవుట్ పోలీస్ స్టేషన్లోనే స్టేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. అంతకుముందు ఏఎస్సీ పెంచలస్వామి, ఆదిలక్ష్మి, ఆంజనేయస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట స్థానిక సీఐ కోటేశ్వరరావు, ఎస్సై క్రాంతికుమార్, ఏఎస్సై వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బంది ఉన్నారు.