ఏపీ కొత్త గవర్నర్ నియామకాన్ని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా తీవ్ర విమర్శలు చేశారు. మీరు ఎంత సిగ్గులేనివారు? మిలార్డ్ విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తూ కేంద్ర సర్కారు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.
‘‘మరో సుప్రీంకోర్టు జడ్జి రిటైర్ అయిన రెండు నెలల్లోనే గవర్నర్ గా నియమితులయ్యారు. మెజారిటీ ప్రభుత్వం అవగాహన గురించి పట్టించుకోదు. కానీ మీరు ఎంత సిగ్గులేనివారు? మిలార్డ్ దీన్ని అంగీకరించాలా?’’ అంటూ మహువా ట్వీట్ చేశారు. జస్టిస్ నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైరైన 40 రోజుల్లోనే గవర్నర్ గా నియమితులు కావడం గమనార్హం. దీంతో ఇది చర్చనీయాంశం అయింది.
2019లో రామ జన్మభూమిపై తీర్పు చెప్పిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ నజీర్ కూడా ఒకరు. డీమోనిటైజేషన్ నిర్ణయాన్ని సమర్థించిన ధర్మాసనానికి కూడా జస్టిస్ నజీర్ నేతృత్వం వహించారు. టీఎంసీ అనే కాకుండా కాంగ్రెస్ పార్టీ సైతం ఏపీ గవర్నర్ గా నజీర్ నియామకాన్ని ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ దీనిపై స్పందించారు. రిటైర్మెంట్ కు ముందు తీర్పులపై రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఉద్యోగాల ప్రభావం గురించి గతంలో అరుణ్ జైట్లీ మాట్లాడిన వీడియోని షేర్ చేశారు.