సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 20 మంది వరకు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని సీఎం మండిపడినట్లు తెలిసింది. ఆ నియోజకవర్గాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని జగన్ చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యేల పని తీరు పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ప్రజలతో మమేకం అయ్యేలా ఎమ్మెల్యేలను గడప గడపకు ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికలకు వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి ప్రతీ నియోజకవర్గాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. నియోజకవర్గాల్లోని క్షేత్ర స్థాయి పరిస్థితులు.. ఎమ్మెల్యేల పని తీరు ప్రాతిపదికగా సర్వే నివేదికలు అందుతున్నాయి. గెలిచే వారికే టికెట్లు అని ఇప్పటికే స్పష్టం చేశారు. పనితీరు మెరుగు పర్చుకోవాల్సిన వారికి హెచ్చరికలు కూడా చేశారు.