నర్సీపట్నం హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన సోమవారం వేకువజామున అనంతగిరి ఘాట్ రోడ్డులో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే......నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎ.రాంబాబు (51) ఆదివారం అరకులోయలో జరిగిన 1996 బ్యాచ్‌కు చెందిన పోలీస్ మిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. వారితో ఆనందంగా గడిపారు. ఆయన విధులు నిర్వహించేది నర్సీపట్నంలోనే అయినా కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని సాగర్‌నగర్‌లో వుండడంతో సోమవారం వేకువజామున కారులో అక్కడకు బయలుదేరారు. కారు ముందు సీట్లో ఇద్దరు, వెనుక సీట్లో రాంబాబు కూర్చున్నారు. కారు అనంతగిరి ఘాట్‌లోని కొదంగుడ గ్రామ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో వెనుక సీట్లో కూర్చున్న రాంబాబు కారులోంచి తుళ్లి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ముందు సీట్లో ఉన్నవారు సీటు బెల్ట్‌లు పెట్టుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. కాగా రాంబాబును 108 వాహనంలో సమీపంలోని ఎస్.కోట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. ఎస్.కోట ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని సాగర్‌నగర్ తరలించారు. అక్కడ పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, సీఐ గణేశ్, ఎస్‌ఐ సిబ్బంది పాల్గొన్నారు. అనంతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాంబాబుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.