వచ్చే నెల 18 తర్వాత రెండు నెలల పాటు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ ఎమ్మెల్యేలను వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. గడప గడపకు కార్యక్రమంలో కొందరు మంత్రులు సహా 20 మంది ఎమ్మెల్యేలు వెనుకబడ్డారని ఆక్షేపించారు. రోజుకు కనీసం రెండు గంటలు కూడా పాల్గొనడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గడప గడపకు, గృహసారథుల నియామకాలపై వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలూ గెలిచే దిశగా వైసీపీ ఎమ్మెల్యేలందరూ రెండు నెలల పాటు ప్రజల్లోనే తిరగాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉందని.. వీటిని ఆషామాషీగా తీసుకోవద్దని అన్నారు. గత ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని.. గతంలో కంటే భిన్నంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ అవుతున్న విషయాన్ని జనానికి వివరించాలని చెప్పారు. ‘ఏ రాజకీయ పార్టీకీ లేనంతగా 5.20 లక్షల మంది గృహ సారథులు.. 45,000 మంది సచివాలయ సమన్వయకర్తలు, రెండున్నర లక్షల మంది వలంటీర్ల వ్యవస్థతో వైసీపీ బలీయంగా ఉంది. గెలుపే లక్ష్యంగా గృహసారథులను నియమించుకోవాలి. వచ్చే నెల 18 నుంచి 26వ తేదీ వరకూ వారికి శిక్షణ తరగతులు నిర్వహించాలి. వచ్చే నెల 18, 19 తేదీల్లో వీటిలో ఎమ్మెల్యేలు తప్పకుండా పాల్గొనాలి. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే స్టిక్కర్లు అంటించాలి. సంక్షేమ పథకాలపై కరపత్రాలతో కిట్ బ్యాగ్‌లను ప్రతి గృహసారథికీ.. వలంటీర్‌కూ.. సమన్వయకర్తకూ అందజేయాలి’ అని తెలిపారు.