ఆహారం బాగా అందుతున్న ఈ రోజుల్లో కూడా ఆకలిచావులు అంటే కాస్త నమ్మశక్యంకాదు. తమిళనాడులో ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాలయంలోని వండిప్పేట్టై కుమణన్ వీధికి చెందిన శాంతి, మోహనసుందరం దంపతులు. వీరికి మానసిక దివ్యాంగుడైన కుమారుడు శరవణకుమార్, కుమార్తె శశిరేఖ ఉన్నారు. కుమార్తె ఆ కుటుంబానికి అండగా ఉంటూ కూలీ పనులు చేసి పోషించింది. అయితే, శశిరేఖకు వివాహం చేయడంతో అత్తారింటికి వెళ్లిన అనంతరం కుటుంబపోషణ కష్టంగా మారింది. శాంతి, వయసు మీదపడిన ఆమె తల్లి కనకంబాళ్, భర్త, కుమారుడు తిండి లేక పస్తులుంటూ అప్పుడప్పుడూ చుట్టుపక్కలవారు పెడుతున్న ఆహారంతో జీవించేవారు. ఈ నేపథ్యంలో ఆరు రోజుల కిందట మోహనసుందరం, కనకాంబాళ్ తిండిలేక ప్రాణాలు కోల్పోయారు. వారికి అంత్యక్రియలు నిర్వహించే స్తోమత కూడా లేకపోవడంతో ఆ మృతదేహాలతో శాంతి ఇంట్లోనే వారం రోజులు పాటు ఉన్నారు.
ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. అనంతరం ఖననం చేశారు. ఇదిలావుంటే దేశంలో ఆకలి చావులు అనేవి ఉండకూడదని.. ప్రజల సంక్షేమం రాజ్యాంగపరమైన బాధ్యత అని..కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రెండేళ్ల కిందట సూచించింది. ఇక నుంచి దేశంలో ఆకలి చావు అనేమాట ఉండకూడదని దీని కోసం కేంద్రం ఎటువంటి ప్రణాళికలు అనుసరిస్తుందో వెంటనే తెలపాలని ఆదేశించింది. ఆకలిని ఎదుర్కోడానికి జాతీయస్థాయిలో మోడల్ స్కీమ్‌ను ఏర్పాటుచేయాలని పేర్కొంది. అయినా ఇప్పటి వరకూ దానిపై కేంద్రం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఆకలి చావుల విషయంలో 2015-2016 నివేదికపై కేంద్రం ఆధారపడటం పట్ల తీవ్రంగా మండిపడింది. ‘దేశంలో ఒక్కటి తప్ప ఆకలి చావులు లేవని మీరు చెబుతున్నారా? మేము ఆ ప్రకటనపై ఆధారపడగలమా?’ అని నిలదీసింది. ‘‘ఆకలి మరణాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదంటే దేశంలో ఆకలి చావులు లేవని అర్ధం చేసుకోవాలా? ఆకలి చావులపై కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారంతో నివేదికను సమర్పించాలి.. దీనిపై అధికారులను అడిగి సమాచారం సేకరించండి’’ అని కేంద్ర తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు సూచించారు.