ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్‌రెడ్డి బుధవారం మరోసారి భూమిపూజ చేశారు. జమ్మలమడుగు మండలం, సున్నపురాళ్లపల్లె దగ్గర స్టీల్‌ప్లాంట్ నిర్మాణం జరుగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... స్టీల్‌ప్లాంట్ నిర్మాణం 3 దశల్లో జరుగుతుందన్నారు. 36 నెలల్లో రూ.3,300 కోట్లతో తొలిదశ నిర్మాణం జరుగుతుందని, మరో ఐదేళ్లలో పరిశ్రమ నిర్మాణం పూర్తవుతుందని స్పష్టం చేశారు. రూ.4 వేల కోట్లతో 3500 ఎకరాల భూమి .. రూ. 700 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని సీఎం జగన్ వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో మొత్తం కడప జిల్లా, ప్రాంతమంతా అభివృద్ధి అవుతుందని సీఎం జగన్ అన్నారు. గతంలో వైఎస్ ఎన్నో కలలు కన్నారని.. నాడు స్టీల్ ప్లాంట్ కోసం పరితపించారని.. తరువాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించు కాలేదని విమర్శించారు. దేవుడి దయవల్ల నేడు జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఆవుతోందని, మూడు దశల్లో పరిశ్రమ నిర్మాణం జరుగుతుందన్నారు. ప్లాంట్ సపోర్ట్ కోసం చాలా కష్ట పడ్డామని.. మంచి రోజులు వచ్చాయన్నారు. స్టీల్ సిటీ కావాలనే అభివృద్ధి పనులు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాగా పనులు చేయకుండా మళ్లీ భూమిపూజ చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.