ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ రాజుకున్న రాజధాని రగడ రాజుకొంది. దీంతో రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. రాజధాని ఇష్యూ దాటి ఎన్నికల రెఫరెండం వరకు వెళ్లాయి.
'మంత్రి బుగ్గన మాట్లాడిన విషయంలో అసలు కన్ఫ్యూజన్ లేదు. బుగ్గన మాట్లాడినప్పుడు 'మిస్ స్పెల్' అయ్యింది. వైజాగ్ స్టేచర్ ఎలివేట్ చేసే సందర్భంలో.. మిస్ స్పెల్ అయ్యింది. కానీ.. సీఎం జగన్ క్లారిటీతో ఉన్నారు. గతంలో చెప్పినట్టు పరిపాలన విశాఖలో, అసెంబ్లీ అమరావతిలో, హైకోర్టు కర్నూలులో ఉంటుంది. ఈ అంశాలతోనే మళ్లీ బిల్లు తీసుకొస్తాం. అందుకే విశాఖను రాజధానిగా చెబుతున్నాం. బుగ్గన చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ కూడా ఢిల్లీలో అదే విషయాన్ని చెప్పారు. అమరావతిని వ్యతిరేకించాలనేది వైసీపీ విధానం కాదు. దమ్ముంటే ప్రతిపక్షాలు అమరావతి ఏకైక రాజధాని అని ఎన్నికలకు రావాలి. మేము కచ్చితంగా మూడు రాజధానుల ఎజెండాతోనే ఎన్నికలకు వస్తాం' అని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.
'2020 నుంచి ఎక్కువ చర్చ జరిగింది ఏపీ రాజధానులపైనే. 2019కి ముందు కూడా అమరావతి అనేది ఎన్నికల అంశంలో లేకుండా పోయింది. వికేంద్రీకరణ అని అందమైన పదంతో మూడు రాజధానులు అంటున్నారు. ఈ విషయంలో.. వైసీపీ మినహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. ఈ సమయంలో.. ఇది ఎన్నికల రెఫరెండంగా మారబోతోంది. అందుకే ప్రతిపక్షాలు దీనిపై డిమాండ్ చేస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వం ఇదేలా వాదిస్తోంది. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని సజ్జల చెబుతున్నారు. ప్రజలకు అమరావతిపై అంత అనుకూలత లేదని వైసీపీ ఒక అంచనాకు వచ్చింది. అందుకే వైసీపీ మారడం లేదు. బుగ్గన చెప్పింది సత్యం. సజ్జల చెప్పింది వ్యూహం. అది ప్రతిపక్షాలకు అర్థం కావడం లేదు' అని రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి వ్యాఖ్యానించారు.
'బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన విషయానికి, సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పిన విషయాలకు చాలా తేడా ఉంది. బెంగళూరులో బుగ్గన చాలా క్లియర్‌గా చెప్పారు. విశాఖనే రాజధాని అని స్పష్టం చేశారు. దీంతో మూడు రాజధానులు వైసీపీ ఎజెండాలో లేవని అర్థం అవుతోంది. అసెంబ్లీ సమావేశాలు గుంటూరులో, హైకోర్టు బెంచ్ కర్నూలులో అంటున్నారు. ఇలా చేస్తే రాజధానులు అంటారా. ఇటీవల కర్నూలులో అంతపెద్ద సభ నిర్వహించి కర్నూలుకు హైకోర్టు తీసుకొస్తామన్నారు. అలా చెప్పిన బుగ్గన ఇప్పుడు విశాఖ ఏకైక రాజధాని అని చెబుతున్నారు. దీంతో వికేంద్రీకరణకు వ్యతిరేకం వైసీపీ అని అర్థం అవుతోంది' అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
'సజ్జల రామకృష్ణా రెడ్డి కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేదు. మూడు రాజధానులపై స్పష్టత లేకుండా మాట్లాడారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవోల ప్రకారం.. అమరావతే రాజధాని. వైసీపీ పక్కా ప్లాన్ ప్రకారం.. ప్రతిపక్షాలను, మీడియాను ట్రాప్‌లో పడేస్తున్నాయి. దీంతో అందరం వీటి వెనుక డిబేట్‌లు పెట్టుకొని పరుగెడుతున్నాం. శివరామకృష్ణన్ కమిటీకి మేము కూడా చెప్పాము.. విశాఖనే రాజధానిగా ఉండాలని. కానీ.. ఆఖరికి అమరావతిని రాజధానిగా ప్రకటించారు. దానికి జగన్ మమ అన్నారు. అప్పుడే ఎందుకు జగన్ కోర్టుకు వెళ్లలేదు. ఇప్పుడు కావాల్సింది అధికార వికేంద్రీకరణ.. రాజధానుల వికేంద్రీకరణ కాదు' అని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యానించారు.