వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణం తీసిందని దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు. పొదిలి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో హత్యోదంతాన్ని వివరించారు. తర్లుపాడు మండలం తాడివారిపల్లి ఘాట్ వద్ద జనవరి 31న బత్తుల దేవధరణి (23) హత్య జరిగింది. దేవధరణి విశాఖపట్నంలో ఉంటున్నాడు. మృతుడి స్వగ్రామం కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దయమ్మనూరు గ్రామం. జులాయిగా తిరుగుతూ నంద్యాలలో కొరియర్ బాయ్‌గా పనిచేస్తుండేవాడు. ఈక్రమంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెకు గతంలో ప్రవీణ్‌కుమార్ అనే మరోవ్యక్తితో పరిచయం ఉంది. ఈతరుణంలో ప్రవీణ్‌కుమార్ తనకు పరిచయం ఉన్న మహిళతో ధరణి మాట్లాడుతున్నాడని అతనిపై కోపం పెంచుకున్నాడు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. కాగా మృతుడి అన్న పవన్‌సాయి వారిద్దరి మధ్య సర్దుబాటు చేశారు. అయినా దేవధరణి మహిళతో పరిచయం మానుకోకపోవడంతో పవన్‌సాయి విశాఖపట్నం తీసుకెళ్లాడు. తను పనిచేసే రెస్టారెంట్‌లో పనికి కుదిర్చాడు. అప్పటికి కూడా సదరు మహిళతో ధరణి మాట్లాడుతూనే ఉన్నాడు. దీంతో కక్షగట్టిన ప్రవీణ్‌కుమార్ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో మరో యువతితో ధరణికి పరిచయం ఏర్పడే విధంగా పథకం రచించాడు. ఆ ప్రకారం విశాఖపట్నంకు చెందిన డ్రైవర్ పగిడి శివకుమార్, తన స్నేహితులైన రాగి ప్రవీణ్‌కుమార్, మనోజ్, నరేష్ (సురేష్), రాగిరి చాణిక్య, యువతితో కలిసి విశాఖపట్నం చేరుకున్నారు. తాను విశాఖపట్నం వచ్చానని తనను కలవాలని యువతితో ధరణికి ఫోన్ చేయించారు. చెప్పిన ప్రాంతానికి వచ్చిన దేవధరణిని కారులో ఎక్కించుకున్నారు. ఆ వెంటనే అతని ముక్కుకు క్లోరోఫాం పెట్టి మత్తులోకి జారుకునేలా చేశారు. విశాఖపట్నం నుంచి నంద్యాలకు కారులో తీసుకుని వస్తూ దారిపొడవునా ధరణి నోట్లో క్లోరోఫామ్‌తోపాటు మత్తుపదార్థాలు, మద్యం పోశారు. తర్లుపాడు మండలం తాడివారిపల్లి ఘాట్ సమీపంలోకి వచ్చేసరికి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నిందితులు కారులో నుంచి బయటకు దించి పెట్రోల్ వంటిపై పోసి కాల్చివేసి వెళ్లిపోయారు. అయితే జనవరి 1న తన తమ్ముడు కనపడటం లేదని అన్న పవన్‌సాయి విశాఖపట్నం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కారుడ్రైవర్ శివకిరణ్‌ను పోలీసులు పట్టుకొని విచారించగా నంద్యాల వెళ్లే మార్గంలో హత్య చేసినట్లు తెలిపాడు. నిందితులైన ప్రవీణ్‌కుమార్, మనోజ్, నరేష్, చాణిక్య, యువతిలను త్వరలో అరెస్ట్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ సుధాకర్, తాడివారిపల్లి ఎస్‌ఐ ముక్కంటి, ఏఎస్‌ఐలు వెంకటేశ్వరరెడ్డి, సురేష్, కానిస్టేబుల్ బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.