అధికార పార్టీలో చేరాలని ఒత్తిడి చేసినా తన భర్త లొంగలేదని, దీంతో అంగనవాడీ సహాయకురాలి పోస్టు నుంచి తనను అన్యాయంగా తొలగించారని శింగనమల మండలం గుమ్మేపల్లికి చెందిన లక్ష్మీదేవి బుధవారం ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు తెలిపిన మేరకు, లక్ష్మిదేవి గుమ్మేపల్లి-2 అంగనవాడీ కేంద్రంలో 2013 నుంచి సహాయకురాలిగా పనిచేస్తోంది. ఆమె భర్త అంకన్న టీడీపీ సానుభూతిపరుడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ గ్రామస్థాయి నాయకులు వీరి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. తమ పార్టీలో చేరాలని, లేదంటే అంగనవాడీ పోస్టు నుంచి తప్పిస్తామని బెదిరించారు. అయినా అంకన్న ఒప్పుకోలేదు. దీంతో లక్ష్మీదేవిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. చిన్నారులు, బాలింతలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అంగనవాడీ కేంద్రంలో శుభ్రతను పాటించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అధికారులు మెమో ఇచ్చి వివరణ కోరారు. దీంతో లక్ష్మీదేవి వివరణ ఇచ్చింది. ఆ తరువాత మరోమారు ఇలాంటి ఫిర్యాదులే చేశారు. అధికారులు తిరిగి వివరణ కోరడంతో, చిన్నారుల తల్లిదండ్రుల సంతకాలతో తాను విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లు వివరణ పంపింది. అయినా అధికారులపై వైసీపీ నాయకులు ఒత్తిడి చేయడంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. సీడీపీఓ ఉమాశంకరమ్మ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అధికార పార్టీలో తన భర్త చేరనందుకు తనను అన్యాయంగా తొలగించారని లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేసింది.