ఏలూరు జిల్లా, ముసునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాట్రేనిపాడు వద్ద జరిగిన తల్లి, కూతురు హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. కాట్రేనిపాడుకు చెందిన సొంగా ఏసు మరియమ్మ భర్త నుంచి విడిపోయి కుమార్తెతో కలిసి ఉంటుంది. పదేళ్ల నుంచి బొమ్ములూరుకు చెందిన దేవరపల్లి రవీంద్ర (రవి)తో సహ జీవనం చేస్తోంది. కొంతకాలంగా రవీంద్ర మరియమ్మపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ గొడవలు పడుతున్నాడు. ఆమె సంపాదనతో విలాసాలు చేస్తూ మద్యానికి బానిసయ్యాడు. రవి నిర్మించుకున్న ఇంటిలోకి అతన్ని ఆమె రానివ్వడం లేదు. తనను నిర్లక్ష్యం చేస్తున్న ఆమెను హత్య చేయాలని తన స్నేహితుడు ముదిరాజును సంప్రదించాడు. మరో స్నేహితుడు మంగి భువనేశ్వర్(చందు)తో కలిసి ఈ నెల మూడో తేదీ రాత్రి తల్లి కూతుళ్లు నిద్రిస్తున్న సమయంలో వారిని సుత్తితో మోది కొట్టి చంపి పారిపోయారు. వారిపై కేసు నమోదుచేశారు. ప్రధాన నిందితుడు మీర్జాపురానికి చెందిన దేవర పల్లి రవీంద్ర, ఏలూరుకు చెందిన మంగి భువనే శ్వరరావుతోపాటు నిందితులు పారిపోవడానికి సాయం చేసి, హత్య విషయాన్ని గోప్యంగా ఉంచిన రవీంద్ర సోదరి మస్తాకుమారి, అబ్బ దాసరి శ్రీనులను అరెస్టు చేశారు.