తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో వివిధ కేసుల్లో పది మందిని అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ బుధవారం పట్టణ పోలీస్టేషన్ వద్ద వివరాలు వెల్లడించారు. చైన్ స్నాచింగ్ చేస్తూ రాత్రిపూట దొంగతనాలు చేసిన దొంగలను భీమవరం సీసీఎస్, తాడేపల్లిగూడెం పట్టణ, రూరల్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పట్టుకున్నారు. దొంగలంతా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారుగా గుర్తించారు. మహ్మద్ షాఖీర్‌ఖాన్, అస్లామ్ (గుడ్డు), షావేజ్ ఖాన్‌లను అరెస్టు చేసి వారి నుంచి రూ.1.70 లక్షల నగదు, రూ.2 లక్షలు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని శశి కళాశాల రోడ్డులో మంగలవారం రాత్రి గంజాయి విక్రయిస్తున్న తాడే పల్లిగూడేనికి చెందిన షేక్ అక్బర్, గుత్తుల రవి, దెందుకూరి చిదంబర వెంకట రాజులను అరెస్టు చేసి వారి నుంచి 24 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. పట్టణ సీఐ నాగరాజు క్రైమ్ సిబ్బందితో ఐఎంఈఐ డేటా ద్వారా ట్రేస్ చేసి 8 లక్షల విలువ చేసే 45 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఆ ఫోన్‌ల డేటా ఆధారంగా ఎవరి ఫొన్లు వారికి అందిస్తామని తెలిపారు. బుధవారం తెల్లవారు జామున తాడేపల్లిగూడెం శివాలయం రోడ్డులో కనకదుర్గమ్మ గుడి దగ్గర అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రెడ్డి నారాయణ, యర్రసాని వెంకట్రావు, బెజవాడ నాగరాజు, ఉయ్యాల పల్లయ్యలను అరెస్టు చేసి వారి నుంచి 36 మద్యం సీసాలు, రూ.600 నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. చాక చక్యంగా వ్యవహరించిన భీమవరం సీసీఎస్ సీఐ రఘు, పట్టణ సీఐ నాగరాజు, రూరల్ సీఐ మూర్తి, ఎస్సైలు భద్రరావు, ఆదినారాయణ, రెహ్మాన్, ఏఎస్సై జిలాని, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్, నరేష్, సీహెచ్ మోహనరావులకు ఎస్పీ రవిప్రకాష్, డీఎస్పీ శ్రీనాథ్‌లు రివార్డులు అందించారు.