కొడాలి నానికి సీబీఐ అధికారులు నాలుగు తగిలిస్తే వై.ఎస్. వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటికి వస్తాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన కీలక అంశాలు కొడాలి నానికి తెలుసని.. సీబీఐ అధికారులు కొడాలి నానిని కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ కుటుంబంలో కొడాలి నాని చిచ్చు పెడుతున్నారని.. వైసీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం కొడాలి నాని ప్రయత్నిస్తున్నారని బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బుద్ధా చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
కమ్మ సామాజిక వర్గం కోటాలో ఎమ్మెల్యే, మంత్రి అయిన కొడాలి నాని.. రోజూ ఆ సామాజికవర్గ నేతలను టార్గెట్ చేస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. కొడాలి నాని వాళ్ల నాన్న పేరు ఎప్పుడూ ఎందుకు చెప్పుకోరని ప్రశ్నించారు. గుడివాడలో హరికృష్ణ పోటీచేస్తే.. నాని వెన్నుపోటు పొడిచారని.. అందుకే ఆయనకు నాలుగో స్థానం దక్కిందని వ్యాఖ్యానించారు. టీడీపీలో అధికార మార్పిడి సమయంలో వైస్రాయ్ హోటల్ గేటును పట్టుకుని వేలాడింది కొడాలి నాని అని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే.. గతిలేక వైసీపీలో చేరారని విమర్శించారు.
వైఎస్సార్సీపీలో కూడా కొంత మంది మంచి నేతలు ఉన్నారని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. అలాంటి నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాటలో బయటికి రావాలని పిలుపునిచ్చారు. కొడాలి నాని వైఖరి దొంగే దొంగ అన్నట్టుందని బుద్ధా వెంకన్న విమర్శించారు. లోకేష్ పాదయాత్ర సక్సెస్ అవ్వటంతో.. ఇన్ని రోజులు గొలుసులతో తాడేపల్లిలో కట్టేసిన పిచ్చి కుక్కల్ని బయటికి వదిలారని.. బుద్ధా వెంకన్న ఘాటు విమర్శలు చేశారు. అయితే.. బుద్ధా వెంకన్న వ్యాఖ్యలపై కొడాలి నాని ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.