కైకలూరు లో దారుణం జరిగింది. వృద్ధుడికి బలవంతంగా కలుపుమందు తాగించగా ఆ వృద్ధుడు నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్ళితే..... కైకలూరుకు చెందిన మత్తే సత్యానందం (72) సోమవరం గ్రామంలో చేపల పెంపకానికి చెరువును పాడుకున్నారు. ఈ క్రమంలో చేపలు పట్టే నిమిత్తం బుధవారం రాత్రి చెరువులో నీటిని మోటార్లతో బయటకు తోడుతుండగా చెరువుకు మరోవైపు అలికిడి కావడంతో సత్యానందం అటువైపు వెళ్ళాడు. అక్కడ గ్రామానికి చెందిన చెన్నారావు, రామారావు దొంగతనంగా చేపలు పడుతుండటంతో వారితో సత్యానందం వాగ్వాదానికి దిగాడు. దీంతో వారు కలుపుమందును బలవంతంగా సత్యానందం నోట్లో పోయడంతో అతడు అక్కడే పడిపోయాడు. ఇది గమనించిన సత్యానందం మనుమడు సతీష్‌బాబు, సత్యానందాన్ని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. అయితే సత్యానందానికి వైద్యం అందించటంలో వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం వహించినందునే అతను చనిపోయాడని అతని బంధువులు ఏరియా ఆసుపత్రి వద్ద సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి బంధువుల ఆరోపణలపై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర సింగ్‌ను వివరణ కోరగా వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేపలేదని ఆయన సమాధానమిచ్చారు.