శ్రీకాకుళం జిల్లా,పలాస స్థానిక బీసీ బాలికల హాస్టల్‌ను అధికా రుల బృందం గురువారం సందర్శించింది. ఆహార కల్తీ (ఫుడ్‌పాయిజనింగ్)తో హాస్టల్ విద్యార్థినులు బుధవారం రాత్రి అస్వ స్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం డీఈవో జి.పగడాలమ్మ, ఆర్డీవో టి.సీతారామమూర్తి, తహసీల్దార్ ఎల్. మధుసూదనరావు, జ్యోతిరావుబాపూలే పాఠశాలల జిల్లా కన్వీనర్ జె.లక్ష్మణ మూర్తి, ఎంఈవో సీహెచ్.శ్రీనివాసరావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం డి.తులసీరావులతో కూడిన బృందం సందర్శించి వివరాలు సేకరించింది. విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు వారితో సహపంక్తి భోజనంచేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల ఆరోగ్యంపై ఆరా తీశారు. హాస్టల్ నిర్వహణ, తాగునీటి సౌకర్యం, నాణ్యమైన భోజనం పెడుతున్నారా వంటి అంశాలను ఆరా తీశారు. సమస్యలు చెప్పేందుకు ఇబ్బందులుంటే చీటీ రాసి ఇవ్వాలని వారు కోరడంతో పలువురు విద్యార్థినులు వారి అభిప్రాయాలను తెలిపారు. డీఈవో పగడాలమ్మ మాట్లాడుతూ.. రోజుకో విధంగా ఆహారం పెడుతున్నట్లు విద్యార్థినులు తమ దృష్టికి తీసుకు వచ్చారన్నారు. ప్రిన్సిపాల్ విద్యాధరరావు పాఠశాలలో అందుబాటులో ఉండడం లేదని తమ పరిశీలనలో తెలిందన్నారు.