విజయనగరం జిల్లా, మెంటాడ మండలంలోని పోరాం పంచాయతీ పోరపులోవ పరిధిలోగల ఓ తోటలో ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం దాడి చేశారని ఆండ్ర ఎస్ఐ సిద్ధార్థ్కుమార్ గురువారం తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే..... కాకినాడకు చెందిన తిరుమలరాజు జగన్నాథరావు 15 ఏళ్ల కిందట పోరంలోవ పరిధిలో భూమి కొనుగోలు చేశాడు. ఇక్కడ జీడిమామిడి సాగు చేస్తున్నాడు. వారంలో రెండు రోజులు తోటలో నిర్మించిన ఫాంహౌస్లో ఉంటూ సాగు చేయిస్తూ ఉండేవాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం ఇక్కడకు వచ్చాడు. వస్తున్నట్లు తోటమాలికి ముందుగా సమాచారం అందించాడు. మధ్యాహ్నం తోటమాలి తోటలోకి వెళ్లింది. గదికి తాళం వేసి ఉండగా, తోటంతా వెతికింది. మళ్లీ గది వద్దకు వచ్చి పరిశీలించింది. లోపల నుంచి శబ్ధం రావడం, గదికి తాళం వేసి ఉండడంతో సమీప తోటలోని పని వారికి విషయం చెరవేసింది. వారంతా వచ్చి పరిశీలించారు. లోపల వ్యక్తి ఉన్నట్లు తెలుసుకుని, వారంతా తాళం పగలగొట్టి లోపలకు వెళ్లారు. అప్పటికే జగన్నాథరావు రక్తపు మడుగులో ఉన్నాడు. ప్రైవేట్ వాహనంలో విజయగనరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం క్లూస్ టీం వచ్చి పరిశీలించింది.