తాజాగా వివిధ వాహనాలు వివిధ ఫ్యూచర్లతో మార్కెట్ లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు భారత రోడ్లపై పరుగులు తీస్తున్న అనేక ప్రీమియం ఎస్ యూవీ వాహనాల్లో అడాస్ ఫీచర్ తప్పనిసరిగా ఉంటోంది. అడాస్ అంటే... అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ కు సంక్షిప్త రూపం. అడాస్ ఫీచర్ ను ఆన్ చేస్తే...చాలావరకు డ్రైవింగ్ అంతా కారులోని ఎలక్ట్రానిక్ వ్యవస్థే చూసుకుంటుంది. స్టీరింగ్ కూడా అవసరానికి అనుగుణంగా తనంతట తానే తిరుగుతుంది. అత్యవసర సమయాల్లో ఆటోమేటిగ్గా బ్రేకులు పడతాయి. ఎదురుగా ఎవరైనా అడ్డం వస్తే కారు వెంటనే నిలిచిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ను గుర్తిస్తుంది. లేన్ మారాల్సి వచ్చినప్పుడు అలెర్ట్ చేస్తుంది. డ్రైవర్ నిద్రపోతే వార్నింగ్ లు ఇస్తుంది. డ్రైవర్ తో ప్రమేయం లేకుండా పార్కింగ్ చేయొచ్చు.
అనేక సెన్సర్లు, కెమెరాలతో సమన్వయం చేసుకుంటూ ఈ అడాస్ టెక్నాలజీ పనిచేస్తుంది. భారత్ లో కొన్ని వాహనాల్లో ప్రస్తుతం అడాస్ లెవల్-2 టెక్నాలజీ పొందుపరిచారు. ఎంజీ హెక్టర్, మహీంద్రా ఎక్స్ యూవీ 700, టయోటా ఇన్నోవా హైక్రాస్ వంటి మోడళ్లలో అడాస్ ఫీచర్ చూడొచ్చు. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా కూడా తన సఫారీ, హ్యారియర్ మోడళ్లను అడాస్ లెవల్-2 కి అనుగుణంగా తీర్చిదిద్దింది. టాటా సఫారీ-2023, టాటా హ్యారియర్-2023 మోడళ్లలో అడాస్ టెక్నాలజీ ఏర్పాటు చేశారు. ఈ రెండు అప్ డేటెడ్ వెర్షన్లకు సంబంధించి టాటా మోటార్స్ బుకింగ్స్ కూడా ప్రారంభించింది. సఫారీ, హ్యారియర్లలో అడాస్ మాత్రమే కాదు, మరిన్ని ఆధునికీకరణలు చోటుచేసుకున్నాయి. సరికొత్త 10.2 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ టచ్ స్క్రీన్, 7 అంగుళాల ఆల్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుపరిచారు. 9 స్పీకర్లతో కూడిన జేబీఎల్ ఆడియో సిస్టమ్ తో శ్రావ్యమైన సంగీతం వినవచ్చు. 360 డిగ్రీ కెమెరాలు, వైర్ లెస్ చార్జింగ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, బెనికే కాలికో ఓక్ బ్రౌన్ లెదర్ సీటింగ్ తో ఈ రెండు కార్లను ముస్తాబు చేశారు.