టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం ఘోర విపత్తులో ఇప్పటివరకు 46,000 మందికి పైగా మరణించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా. ప్రమాదం జరిగి చాలా రోజులైన నేపథ్యంలో ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనే ఆశ మసకబారుతున్నందున సహాయ చర్యలను చాలావరకు ఆదివారం రాత్రి ముగించనున్నట్లు టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ అధిపతి యూనస్ సెజర్ తెలిపారు.
భూకంపం ధాటికి టర్కీలో మూడు లక్షలకు పైగా అపార్ట్‌మెంట్లు ధ్వంసమైనట్లు తెలిసింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. భూకంపం కారణంగా టర్కీలో ఇప్పటిదాకా 40,402 మంది మరణించగా, పొరుగున ఉన్న సిరియాలో 5,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఘోరమైన భూకంపం సంభవించి 296 గంటలు గడిచినందున టర్కీలో సహాయ చర్యలను ఈ రోజు ముగించే అవకాశం ఉంది. మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అంటు రోగాల వ్యాప్తిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ విషయంపై టర్కీ ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా మాట్లాడుతూ.. పేగు, ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల పెరుగుదల ఉన్నప్పటికీ వీటివల్ల ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు లేదని అభిప్రాయపడ్డారు.