సోషల్ మీడియాలో యూట్యూబ్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి యూట్యూబ్ కు సారథ్యం వహించే అవకాశం మన భారతీయుడికి దక్కితే అది పెద్ద గౌరవమే. ఇదిలావుంటే సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ సీఈఓగా భారతీయుడు నియమితులయ్యారు. సుదీర్ఘ కాలం సీఈఓగా ఉన్న సూసన్ వొజిసికి పదవి నుంచి తప్పుకోవడంతో యూట్యూబ్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్‌గా ఉన్న భారతీయ సంతతికి చెందిన నీల్ మోహన్ కు పగ్గాలు అప్పగించారు. యూట్యూబ్ సీఈఓగా సూసన్ వొజిసికి తొమ్మిదేళ్ల పాటు పనిచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ వీడియో వేదికగా గుర్తింపు పొందిన యూట్యూబ్‌ను ఇకపై భారతీయుడు నడిపించనున్నారు.
ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో భారతీయులు కీలక పదవులను అధిరోహిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల , అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ ఉన్నారు. తాజాగా, నీల్ మోహన్ మరోసారి భారత్ ఖ్యాతిని ప్రపంచదేశాలకు వ్యాపింపజేశారు. మరో భారతీయుడు పరాగ్ అగర్వాల్ ట్విటర్ సీఈవోగా పనిచేసిన విషయం తెలిసిందే.
కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్‌మోహన్‌కు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అభినందనలు తెలిపారు. సుసాన్ వొజిసికి సేవలపై ప్రశంసలు కురిపించిన ఆయన.. అసాధారణ టీమ్‌ను సిద్ధం చేశారని కితాబిచ్చారు. యూట్యూబ్‌ను నీల్ మోహన్ ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించాలని సుందర్ పిచాయ్ ఆకాంక్షించారు. కాగా, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన నీల్ మోహన్.. 2008లో గూగుల్‌లో చేరారు.
సీఈవో పదవి నుంచి వైదొలిగిన సూసన్ వొజిసికికి యూట్యూబ్‌తో ఎంతో అనుబంధం ఉంది. మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్‌లో 25ఏళ్లుగా పలు పదవుల్లో కొనసాగారు. యూట్యూబ్‌కు గత తొమ్మిది ఏళ్లుగా సీఈవోగా ఉన్నారు. బాధ్యతల నుంచి వైదొలుగుతున్న సందర్భంగా కంపెనీ ఉద్యోగులకు సూసన్ లేఖ రాశారు. కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించేందుకు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నారు. కొత్త ప్రయాణం పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నానని ఆమె వివరించారు.
ఈ సందర్భంగా ఆల్ఫాబెట్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గే బ్రిన్‌లు ఆమె సేవలను కొనియాడారు. గూగుల్ చరిత్రలో సూసన్‌కు ఒక ప్రత్యేక స్థానముందని... ప్రతిచోటా ప్రజలు ఉపయోగించే ఉత్పత్తులకు ఆమె అత్యంత అద్భుత సహకారం అందించారని అన్నారు. గూగుల్ యాడ్ ప్రాజెక్ట్‌కు వైస్-ప్రెసిడెంట్‌గా పనిచేసిన సూసన్.. 2014లో యూట్యూబ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. గూగుల్‌లో చేరకముందు ఇంటెల్ కార్పొరేషన్, బెయిన్ అండ్ కంపెనీల్లో పనిచేశారు. సూసన్ సారథ్యంలో యూట్యూబ్ ఎంతో స్థాయికి చేరుకుంది. ఎన్నో లాభాలను ఆర్జించిందిద. గతేడాది యూట్యూబ్ ప్రకటనల ఆధారంగా 29.2 బిలియన్ డాలర్లను సంపాదించింది.