పాకిస్తాన్ అంటనే ఉగ్రవాద చర్యలకు నెలవు. అలాంటి పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆయుధాలతో కరాచీ పోలీసు చీఫ్ ఆఫీసులోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా.. ఓ రేంజర్, ఓ పోలీసు అధికారి సహా మరొకరికి గాయాలయ్యాయని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. కానీ 12 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని ప్రచారం జరుగుతోంది. గ్రెనేడ్లు, ఆటోమెటిక్ గన్‌లతో కూడిన మిలిటెంట్లు షరియా ఫైజల్ ప్రాంతంలోని పోలీసు చీఫ్ ఆఫీసులోకి చొరబడగా.. ఆ ప్రాంతంలో కాల్పుల శబ్దంతోపాటు.. పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు.
ఉగ్రవాదులను ఏరివేయడానికి పోలీసులు, రేంజర్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఒక్కో ఫ్లోర్‌ను క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఉగ్రవాదులు ఆత్మాహుతికి కూడా తెగబడుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 8 మంది వరకు సాయుధ మిలిటెంట్లు పోలీస్ చీఫ్ ఆఫీసులో ఉన్నారని భావిస్తున్నారు. వీరి అదుపులో పోలీసులు ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు తెహ్రీక్ ఇ తాలిబన్ ఇ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకున్నట్లు సమాచారం.
ఇదిలావుంటే కరాచీ పోలీసు ఛీఫ్ ఆఫీసుకు చేరువలో ఓ అనుమానాస్పద కారును గుర్తించారు. ఈ కారులోనే ఉగ్రవాదులు నగరంలోకి ప్రవేశించి ఉంటారని భావిస్తున్నారు. పోలీసు చీఫ్ ఆఫీసు వెనుక ఉన్న మసీదుకు సమీపంలో ఈ కారును నిలిపి ఉంచారు. కారును సీజ్ చేసిన భద్రతాదళాలు బాంబు స్క్వాడ్‌ను రంగంలోకి దింపాయి. గత నెల 30న పాకిస్థానీ తాలిబన్లు పెషావర్‌లోని ఓ మసీదులో పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాకిస్థాన్‌లోని అన్ని ప్రావిన్సుల్లో చెక్‌పాయింట్లను పటిష్టం చేసి, అదనపు బలగాలను మోహరించారు.