చైనాకు చెందిన ఓ యువతి మాత్రం తనకు బాయ్‌ఫ్రెండ్ లేడని సోషల్ మీడియాలో శోకాలు పెట్టడం వైరల్‌గా మారింది. షాంఘైకి చెందిన 28 ఏళ్ల యువతి ఫిబ్రవరి 12న తన వదినతో చాటింగ్ చేస్తూ.. మాటల్లో తన చేయిపట్టుకునేందుకు ఒక్కండే ఒక్కడు ముందుకు రావడంలేదని వాపోయింది. ఉద్యోగం, సంపాదన, తల్లిదండ్రుల అంచనాలు, శాశ్వతంగా ఒంటరిగా ఉండిపోతానేమోనని తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నానని పేర్కొంది.
అంతేకాదు, బాయ్‌ఫ్రెండ్ కోసం పలు డేటింగ్ యాప్స్‌లో రిక్వెస్ట్‌లు పెట్టినా ఫలితం లేదని, నా జుట్టు తెల్లబడిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ, నేను నిరాశపడకుండా ప్రయత్నిస్తానని ఆమె చెప్పింది. తన ప్రయత్నాలు ఫలించి తప్పకుండా ఏదో ఒక రోజు తనకు తగినవాడు దొరకుతాడని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ‘‘నేను నా తల్లిదండ్రులను నిరుత్సాహపరచలేను.. కాబట్టి నేను గడ్డు రోజుల్లో ధైర్యంగా ఉన్నాను..’’అని తెలిపింది.
రోజూ ఆహారం కోసం కొన్ని వందల యువాన్లు ఖర్చు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని, తనకున్న పరిమితమైన సంపద వల్ల డేటింగ్ కోసం ఖర్చు చేయడానికి ఇష్టపడట్లేదని ఆమె చెప్పింది. నేను నా కోసం బూట్లు కొనడానికి ఖర్చు పెట్టడాన్ని కూడా ఇష్టపడను అని పేర్కొంది.
అయితే, ఇది ఆమె ఒక్కరి పరిస్థితే కాదు.. చైనాలోని అమ్మాయిలకు ప్రస్తుతం ఇదే పెద్ద సమస్య. జనాభా నియంత్రణకు గతంలో చైనా పాలకులు చేపట్టిన కఠిన చర్యలతోనే అక్కడ ఈ పరిస్థితి దాపురించింది. 2019లో చైనాకు చెందిన రెండు కంపెనీలు తమ వద్ద పనిచేసే 30 ఏళ్లు దాటిన అవివాహిత మహిళలకు డేటింగ్ కోసమే 30 రోజుల అదనపు సెలవులను కూడా మంజూరు చేయడం గమనార్హం.
ఎక్కువగా ఆఫీసుల్లోనే గడపటం, బయట ప్రపంచంతో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండటం వల్ల ఇలాంటి పరిణామాలు ఏర్పడుతున్నాయని కొన్ని సంస్థలు తెలిపాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై జాలిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. నేను ఆమె కంటే రెండేళ్లు పెద్దవాడిని, కాబట్టి నేను ఆమె ఆందోళనను లోతుగా అర్ధం చేసుకోగలను అని ఒకరు.. తనకు గతంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని ఒక యువకుడు పేర్కొన్నారు. ఆమె వేదన తమకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని మరో నెటిజన్ వాపోయాడు.
తోడు వెతకడానికి మీరు ఎందుకు తొందరపడాలనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ప్రకాశింపజేసుకునే అద్భుతమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుందా? అని ఒకరు.. ‘దయచేసి దాని కోసం పెళ్లి చేసుకోకండి.. లేకపోతే, మీరు మరింత ఏడుస్తారు’ అని ఇంకొకరు కామెంట్ చేశారు.