రసగుల్లా కోసం మొదలైన వివాదం చివరకు వ్యక్తి ప్రాణాలు పోయిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలోని బికాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. హరియాణాకు చెందిన అమ్మాయికి.. బికాపూర్ అబ్బాయితో పెళ్లి జరిగింది. వివాహ విందుకు వచ్చిన నలుగురు అతిథులు.. బకెట్‌లోని రసగుల్లాలు తెగ లాంగించేస్తున్నారు. ఇది గమనించిన వధువు బంధువు రణ్‌వీర్ సింగ్ (50) వారిని నిలదీయడంతో గొడవ మొదలయ్యింది. దీంతో రెచ్చిపోయిన యువకులు.. కర్రలు, ఐరన్ రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రణ్‌వీర్ సింగ్, అతడి బావ రామ్ కిశోర్‌లకు గాయలయ్యాయి. తీవ్రంగా గాయపడిన రణ్‌వీర్ అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన రామ్ కిశోర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు బికాపూర్ గ్రామానికి చెందిన రజత్, అజయ్, సత్యభాన్, భరత్‌గా గుర్తించారు. వీరంతా పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వధువు బంధువు సచిన్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘స్టోరేజీ బకెట్‌లోంచి రజత్ రసగుల్లాలు తీసుకుని తింటుండగా మా మామ రామ్‌కిషోర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదానికి దిగారు. వెంటనే, అతని సహచరులు ముగ్గురు కలిసి గొడవకు దిగారు’’అని చెప్పారు. అప్పటి వరకు పెళ్లి వేడుకతో సందడిగా ఉన్న వాతావరణం.. వధువు బంధువు మృతితో విషాదంగా మారిపోయింది.