దేశ రాజకీయాలలో రాణించాలని భావిస్తున్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపనతో వివిధ రాష్ట్రాల్లో అడుగులేస్తున్నారు. పక్కరాష్ట్రమైన ఏపీలో కూడా అదే తరహాలో పావులు కదుపుతున్నారు. ఇకపోతే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్. ఎప్పుడు ఎలా మారతాయో ఊహించటం చాలా కష్టం. చిన్నచిన్న అంశాలు కూడా ఏపీ రాజకీయాలను మారుస్తూ ఉంటాయి. తాజాగా.. ఓ తెలుగు పేపర్‌లో వచ్చిన విశ్లేషణ ఇప్పుడు ఆంధ్రా రాజకీయాలను కుదిపేస్తోంది. ఇన్నాళ్లు టీడీపీ, జనసేన కలిసి 2024 ఎన్నికలకు వెళ్తాయని అందరూ అనుకున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరిగింది.
దీంతో టీడీపీ-జనసేన పార్టీల పొత్తును అధికారికంగా ప్రకటించటమే తరువాయి అనుకున్నారంతా. ఈ సమయంలో ఓ కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు గులాబీ దళపతి కేసీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ప్రముఖ మీడియా అధినేత ఓ విశ్లేషణ రాశారు. ఏపీ రాజకీయాలపై కేసీఆర్ ఎందుకు దృష్టి సారిస్తున్నారు? పవన్‌కు ఇచ్చిన ఆఫర్ ఎంత? వంటి విషయాలను అందులో ప్రస్తావించారు.
'ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశం లేదు. టీడీపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ రంగంలోకి దిగారు. జగన్‌కు సహాయపడటానికి ప్రణాళికలు రచిస్తున్నారు. రాజకీయపరంగా చంద్రబాబు అంటే గిట్టని కేసీఆర్.. చంద్రబాబును అధికారంలోకి రాకుండా చూడాలని భావిస్తున్నారు. అందుకే తన బీఆర్‌ఎస్ పార్టీలో కాపులకు స్థానం కల్పించి.. ప్రజా వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం మొదలుపెట్టారు' అని విశ్లేషించారు.
అంతేకాదు.. 'జనసేన-టీడీపీ పొత్తును కూడా అడ్డుకోవటానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. పవన్‌కు వెయ్యి కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. ఓ 30 స్థానాలు గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని పవన్‌కు నచ్చజెబుతున్నారు. చంద్రబాబు, పవన్ విడిపోవటం వల్ల జగన్ అధికారంలోకి వస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. పవన్‌ను ఎలాగైనా తన వైపు తిప్పుకుని జగన్‌కు మేలు చేసే ప్రయత్నంలో పడ్డారు. అలా కాకపోతే.. టీడీపీ-జనసేన పొత్తులతో వెళ్లాలనుకుంటే.. పవన్ సీఎం పదవి అడగాలని అంటున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ తన దూతలతో పవన్‌పై ఒత్తిడి తెస్తున్నారు' అని విశ్లేషించారు.
ఈ విశ్లేషణ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కథనంపై పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సదరు మీడియా సంస్థపై, విశ్లేషణ చేసిన ఆ సంస్థ అధిపతిపై ఫైర్ అవుతున్నారు.