తిరుమలలో ఘోర ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. తిరుమల కొండకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. కొండపైకి వెళ్తున్న బస్సు అదుపుతప్పి పిట్ట గోడను ఢీకొట్టింది. లింకు రోడ్డుకు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం అనంతరం ప్రయాణికులను వేరే బస్సులో తిరుమల కొండ పైకి తరలించారు. ఈ బస్సు భక్తులకు ప్రాణాపాయం తప్పింది. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఘటనా స్థలానికి క్రేన్లను తీసుకొచ్చి బస్సును బయటకు తీశారు. కొన్ని రోజుల కిందటే ఆర్టీసీ బస్సు ఇదే ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి లోయలోకి జారిపడబోయింది. లోయ అంచుల్లో ఉన్న చెట్లకు చిక్కుకుని నిలిచిపోయింది. తరుచూ ఇలా ప్రమాదాలు జరుగుతుండటంతో.. అధికారులు నివారణపై దృష్టి పెట్టారు. మలుపుల వద్ద సూచికలు ఏర్పాటు చేశారు. స్పీడ్ బ్రేకర్లు నిర్మించారు. పిట్ట గోడలను మరింత పటిష్టం చేశారు.