ప్రముఖ సినీ నటుడు, తెలుగు దేశం పార్టీ నాయకుడు నందమూరి తారకరత్న కోలుకుని తిరిగొస్తారని ఆశించామని, కానీ ఇలా అర్ధంతరంగా కన్నుమూస్తారని అనుకోలేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన చంద్రబాబు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని తారకరత్న తనతో చెప్పినట్లు వెల్లడించారు. అలాంటిది, చిన్న వయసులోనే తారకరత్న చనిపోవడం బాధేస్తోందని చంద్రబాబు అన్నారు. కుటుంబం, అభిమానులు ప్రార్థించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ నెల 22వ తేదీకి తారకరత్నకు 40 సంవత్సరాలు పూర్తి అవుతాయని.. ఒక మంచి భవిష్యత్ ఉన్న వ్యక్తిని ఇలా మధ్యలోనే అందర్నీ వదిలి వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు.
సినిమా రంగంలో ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభోత్సవం చేసిన రికార్డు తారకరత్న సొంతమని చంద్రబాబు అన్నారు. ‘అమరావతి’ సినిమాలో నటనకు గాను నంది అవార్డును సైతం సొంతం చేసుకున్నారని గుర్తు చేశారు. ఎప్పుడూ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఉండేవారన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తారకరత్న చెప్పారని.. దీంతో ఆయనకు అవకాశం ఇద్దామనుకున్నామని వెల్లడించారు. దీనిపై సమయం వచ్చినపుడు మాట్లాడతానని ఆయనతో చెప్పానని తెలిపారు. ఈలోపే తారకరత్న చనిపోవడం బాధాకరమన్నారు.
మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు సహకరించాలని చంద్రబాబు అన్నారు. కుటుంబ సభ్యులమంతా ఇప్పుడు ఆవేదనలో ఉన్నామన్నారు. చిన్న వయసులో తారకరత్న ఏ ఆశయాల కోసం పనిచేశారో వాటిని ముందుకు తీసుకెళ్లేలా అభిమానులు కృషి చేయాలని కోరుకుంటున్నట్లు పిలుపునిచ్చారు. తారకరత్న పిల్లలను చూస్తే చాలా బాధగా ఉందని.. భగవంతుడు ఆ కుటుంబానికి అన్నివిధాలా సహకరించాలన్నారు. తాము కూడా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.