శివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులు భక్తిశ్రద్ధలతో శంకరుడ్ని పూజిస్తుంటే, వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ లో దారుణమైన పోస్టు పెట్టిందని మండిపడ్డారు. ఇదిలావుంటే శివరాత్రి సందర్భంగా సోషల్ మీడియాలో వైసీపీ పెట్టిన పోస్టు విమర్శలకు దారితీస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఒక బాలుడికి పాలు తాగిస్తున్నట్టుగా ఆ పోస్టులో ఉందని, అయితే ఆ బాలుడి వేషధారణ చూస్తుంటే బాల శివుడిలా ఉందని, పక్కనే నందీశ్వరుడ్ని కూడా చూడొచ్చని జీవీఎల్ వివరించారు. భగవంతుడికి పాలు పోసే సేవలో తరిస్తున్న జగన్ ను ఆ ఫొటోలో చూపించారని, భగవంతుడ్ని ఆ స్థాయిలో చూపించడం కేవలం హిందూ మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు.
"ఇటువంటి అభిషేకాలు చేయరాదని వాళ్ల ఆలోచనలా ఉంది. ఆ ట్వీట్ పెట్టింది హిందువో కాదో తెలియదు. జగన్ ఇదంతా తెలిసే చేశారా? ఒకవేళ తెలియకుండా చేసుంటే క్షమాపణ చెబుతారా? చెప్పరా?" అని జీవీఎల్ డిమాండ్ చేశారు. మహాశివరాత్రి నాడు భక్తులను ఉద్దేశించి పోస్టు చేయాలంటే ఇలాంటి తప్పుడు పోస్టర్లు రూపొందించాల్సిన పనిలేదని అన్నారు.
ఇది అభినందిస్తూ వేసిన పోస్టర్ కాదని, కించపరచడమేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఏ మతాన్నయినా అవలంబించవచ్చు... కానీ రాష్ట్రంలో హిందూ మతాన్ని ఈ రకంగా అవమానించడం చాలా బాధాకరం అని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని జీవీఎల్ పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడిగా జగన్ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు.
"మహా శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తుంది... మరి ఇలాంటి సందేశాలు ఇవ్వడానికి జగన్ తానేమైనా జగ్గీ గురువు అనుకుంటున్నాడా? ఇలాంటి సందేశాలు అవసరంలేదు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నాలు ఎవరూ చేయవద్దు. హిందూ వ్యతిరేకులు చూసి సంతోషించే విధంగా ఆ పోస్టు ఉంది. హిందువులను అవమానపరిచేలా ఆ పోస్టు పెట్టారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో ఎంతోమంది పిల్లలు ఆహారం లేదని గగ్గోలు పెడుతుంటే, వాళ్లని పట్టించుకున్న నాథుడే లేడు, అంతా అవినీతిమయం. రాష్ట్రమంతా ఈయనే పౌష్టికాహారం అందిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. పైగా, భగవంతుడి వేషధారణలో ఉన్న పిల్లవాడికి ఇలా చేయడం తీవ్ర అభ్యంతరకరం. దీనికి వైసీపీ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందే" అని జీవీఎల్ డిమాండ్ చేశారు.